CM Revanth Reddy: తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవానికి రండి
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:37 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
అమిత్ షా, కిషన్‌రెడ్డి, సంజయ్‌కు సీఎం ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకు శుక్రవారం సీఎం లేఖలు పంపించారు.
1948 సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని’ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు.