Share News

Bhatti Vikramarka: రుణభారం ఉపశమనం కల్పించండి..

ABN , Publish Date - Aug 25 , 2024 | 02:54 AM

సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

Bhatti Vikramarka: రుణభారం ఉపశమనం కల్పించండి..

  • రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించండి

  • వెనుకబడిన ప్రాంతాల నిధులివ్వండి

  • ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించండి

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు

  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాకు భేటీ వివరాలు తెలిపారు.


కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానన్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు బడ్జెటేతర రుణాలు తీసుకుందని, అవి ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు పెనుభారంగా మారాయన్నారు. వాటిని రీస్ట్రక్చరింగ్‌ చేసి, కొంత ఉపశమనం కలిగించాలని కోరానన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి రూ.31,795 కోట్ల మేర అప్పులు చేసిందన్నారు.


జీతాల కంటే అప్పులపై వడ్డీకే ఎక్కువ అవుతోందన్నారు. విద్యుత్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గత కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరానన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారుల సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు భట్టి తెలిపారు.


  • కేంద్రాన్ని భట్టి ఏం అడిగారంటే..

  • సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాల కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.31,795 కోట్ల బడ్జెటేతర రుణాలను ప్రభుత్వం తీసుకుంది. వీటికి 10.75 శాతం, 11.25 శాతం అధిక వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఈ రుణాలను రీస్ట్రక్చర్‌ చేసేలా ఆర్థిక సంస్థలను ఒప్పించాలి.

  • కేంద్ర సౌజన్య పథకాల(సీఎ్‌సఎస్‌) కింద 2024-25లో ఏపీ, తెలంగాణకు విడివిగా రావాల్సిన నిధులను పొరపాటున ఏపీకి విడుదల చేశారు. దాంతో తెలంగాణ నిధులు రూ.495.20 కోట్లు ఏపీకి వెళ్లాయి. వాటిని తిరిగి ఇప్పించాలి.

  • ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద తెలంగాణకు 2019-20 నుంచి 2023-24 వరకు నిధులు రావాలి. వీటిని వెంటనే విడుదల చేయాలి.

  • ఆంధ్రప్రదేశ్‌ భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన రూ.455.76 కోట్లు, ఏపీ కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన రూ.9.15 కోట్లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేయలేదు. వీటిని బదిలీ చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.

  • ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రావాల్సిన రూ.1,270 కోట్లను ఇప్పించండి.

  • వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ‘నెట్‌ క్రెడిట్‌ క్యారీడ్‌ ఫార్వార్డ్‌ కింద ఏపీ నుంచి రావాల్సిన రూ.208.24కోట్లను ఇప్పించండి.

  • ఉమ్మడి రాజ్‌భవన్‌, హైకోర్టు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ వంటివాటిపై తెలంగాణ రూ.703.43 కోట్లు వ్యయం చేసింది. దీని కింద ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.408.49 కోట్లు ఇప్పించండి.

  • ఏపీ, తెలంగాణ మధ్య రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిల సమస్య ఉందని కేంద్రం ప్రకటించింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ.24,132 కోట్ల వరకు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించండి.

  • విభజన సందర్భంలో మాకు 61 ఐపీఎస్‌ పోస్టులే ఇచ్చారు. ఆ సంఖ్యను పెంచాలి.


  • తీగల బ్రిడ్జిని పూర్తి చేయండి

  • గడ్కరీకి జూపల్లి వినతి

కృష్ణా నదిపై సోమశిల(తెలంగాణ)-సంగమేశ్వర (ఆంధ్ర ప్రదేశ్‌) మధ్య డబుల్‌ డెకర్‌ కేబుల్‌ ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1,082.56 కోట్లతో నిర్మించ తలపెట్టిన తీగల వంతెన నిర్మాణం వివిధ కారణాల వల్ల రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. బ్రిడ్జ్‌ నిర్మాణంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి గడ్కరీతో జూపల్లి సుధీర్ఘంగా చర్చించారు.


శనివారం ఢిల్లీలోని గడ్కరీ నివాసంలో ఆయనతో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. తీగల వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, తెలంగాణ నుంచి తిరుపతికి 70-80 కి.మీ. దూరం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు అలంపూర్‌ ఎక్స్‌ రోడ్‌ (ఎన్‌హెచ్‌-44) నుంచి నల్లగొండ (ఎన్‌హెచ్‌-565) వరకు ఉన్న 203.5 కి.మీ రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్‌ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


ఐకానిక్‌ బ్రిడ్జిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, సెప్టెంబరు నెలాఖరులోగా టెండర్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జూపల్లి చెప్పారు. కాగా, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. షెకావత్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో జూపల్లి భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో మంత్రి జూపల్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Updated Date - Aug 25 , 2024 | 02:54 AM