Share News

Ration Cards: కొత్త రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులపై కమిటీ

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:19 AM

రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్‌ (ఆహార భద్రత) కార్డులు, హెల్త్‌ కార్డుల జారీకి అవసరమైన విధివిధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.

Ration Cards: కొత్త రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులపై కమిటీ

  • ఉత్తమ్‌ చైర్మన్‌గా, దామోదర, పొంగులేటి

  • సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

  • ఈ నెలఖారుకు మార్గదర్శకాల రూపకల్పన

  • సెప్టెంబరులో కొత్త రేషన్‌ కార్డుల జారీకి చాన్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్‌ (ఆహార భద్రత) కార్డులు, హెల్త్‌ కార్డుల జారీకి అవసరమైన విధివిధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సభ్యులుగా నియమించింది.


పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ఈనెలాఖరు వరకు విధి విధానాలను ఖరారు చేసి సెప్టెంబరులో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి కూడా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ కొత్త రేషన్‌ రేషన్‌ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి.


కొత్త కార్డుల కోసం మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చాలంటూ వచ్చిన మరో 11 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, పేదలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులకు లింకు తీసేయాలని నిర్ణయించింది.

Updated Date - Aug 09 , 2024 | 03:19 AM