Teacher : ఉపాధ్యాయుల సర్దుబాటు!
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:43 AM
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉన్నారు.
విద్యార్థి, టీచర్ నిష్పత్తిపై సర్కారు దృష్టి
కలెక్టర్లకు అధికారాలు.. ఉత్తర్వుల జారీ
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉన్నారు. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో ఈ నిష్పత్తి మెరుగ్గానే ఉంది. అయితే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి లో చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని సరిదిద్దాలని సర్కారు నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థాని క పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ సర్దుబాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అధికారాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఆయా పాఠశాలల్లో ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేయాలనే విషయమై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. సాధారణంగా ప్రాథమిక పాఠశాలల్లో 1-10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్; 11-60 మంది ఉంటే ఇద్దరు; 90 మంది ఉంటే ముగ్గురు; 120 మంది ఉంటే నలుగురు; 150 మంది ఉంటే ఐదుగురు; 200 మంది విద్యార్థులుంటే ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అయితే విద్యార్థుల సంఖ్యతో పాటు సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలి. ఒకే ప్రాంగణంలో ఉన్న రెండు మూడు పాఠశాలలను ఒకే పాఠశాలగా పరిగణించి, అక్కడ పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేస్తారు. వీలైనంత వరకు దగ్గరలోని స్కూళ్లకే ఈ సర్దుబాటు చేస్తారు. అలా సాధ్యం కాకపోతే అదే మండల పరిధిలోని ఇతర పాఠశాలలకు పంపిస్తారు. ఈ నెల 28లోపు ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.