Share News

Government Budget: బడ్జెట్‌ 2.90 లక్షల కోట్లు?

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:31 AM

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Government Budget: బడ్జెట్‌ 2.90 లక్షల కోట్లు?

  • 25న క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం.. అదే రోజు అసెంబ్లీలో

  • 22న ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

  • శాఖలు, పథకాల వారీగా బడ్జెట్‌ పద్దుకు తుది మెరుగులు

  • వ్యవసాయం, నీటి పారుదల శాఖలకే ఎక్కువ కేటాయింపులు

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండడంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ మేరకు శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధమ్యాలను వివరించగా.. ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చింది.


ఈ నెల 22న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. శాఖలు, పథకాల వారీగా కేటాయించిన పద్దులను పరిశీలించి ఓకే చెప్పనున్నారు. ఈ నెల 25న ఉదయం క్యాబినెట్‌ సమావేశంలో 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో మంత్రి మండలి సమావేశమవుతుందని సీఎస్‌ శాంతికుమారి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. అదే రోజు(25న) అసెంబ్లీల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.


అందులో రాష్ట్రానికి వచ్చే కేంద్ర గ్రాంట్లు, కేంద్ర సౌజన్య పథకాలు(సీఎ్‌సఎస్‌), పన్నుల్లో వాటాలకు సంబంధించిన నిధులను పరిశీలించిన తర్వాత.. స్వల్ప మార్పులతో రాష్ట్ర బడ్జెట్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ... కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవ రాబడులను పరిగణనలోకి తీసుకోకుండా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆరోపించింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వాస్తవ రాబడులను పరిగణలోకి తీసుకుని రూ.2,75,891 కోట్లతో ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్యారెంటీలు, రుణ మాఫీ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను మళ్లీ రూ.2.90 లక్షల కోట్ల వరకు పెంచనుందని తెలిసింది.


వ్యవసాయ శాఖదే భారీ పద్దు

ఈ సారి బడ్జెట్‌లోనూ వ్యవసాయ శాఖకే భారీ కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రుణమాఫీకి రూ.31వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15వేల కోట్లు, రైతు బీమాకు మరో రూ.7వేల కోట్ల వరకు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. మరోవైపు.. పాత బకాయిల చెల్లింపు, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల ఆవశ్యకత దృష్ట్యా సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.19వేల కోట్ల వరకు ప్రతిపాదనలను సమర్పించింది. ఇందులో రూ.11వేల కోట్ల వరకు కేటాయించే అవకాశాలున్నాయి. ఆరు గ్యారెంటీల్లోని రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. వీటికి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేయనుంది. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి వచ్చే నిధులను పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులను ఖరారు చేయనుంది. అయితే.. మహిళలకు నెలకు రూ.2,500 భృతి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో చోటు కల్పిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


ప్రశ్నలకు వెంటనే జవాబులు పంపాలి

శాసనసభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శనివారం సచివాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌ సమావేశాల్లో సమన్వయ లోపం తలెత్తకుండా ఉండడానికి సీనియర్‌ అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. వివిధ శాఖల డిమాండ్లపై జరిగే చర్చ సమయంలో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Updated Date - Jul 21 , 2024 | 04:31 AM