Share News

TG News: బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నిరంజన్‌

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:08 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు కమిషన్లకు చైర్మన్లను ప్రకటించింది.

TG News: బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నిరంజన్‌

  • విద్య, రైతు కమిషన్ల సారథులుగా ఆకునూరి మురళి, కోదండరెడ్డి

  • బీసీ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు, కార్యదర్శిగా కమిషనర్‌

  • ఒకేసారి.. రైతు కమిషన్‌ ఏర్పాటు,

  • చైర్మన్‌ నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు కమిషన్లకు చైర్మన్లను ప్రకటించింది. కుల గణన నేపథ్యంలో చైర్మన్‌ సహా ఐదుగురితో కీలకమైన బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఎన్నికల హామీల మేరకు కీలకమైన విద్య, రైతు కమిషన్లకూ సారథులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్‌, సభ్యులుగా రాయపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మిని నియమించగా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.


స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ధారించేందుకు బీసీల గణన కోసం దీనినే అధీకృత (డెడికేటెడ్‌) కమిషన్‌గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, విద్యా కమిషన్‌కు రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని, వ్యవసాయ-రైతు సంక్షేమ కమిషన్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డిని సారథులుగా ప్రకటించింది. వీరు రెండేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొంది. రైతు కమిషన్‌ ఏర్పాటు, దానికి చైర్మన్‌ను ఒకే రోజు నియమించింది. కమిషన్‌లో మొత్తం ఆరుగురు ఉంటారు. బీసీ, విద్య, రైతు కమిషన్ల చైర్మన్లుగా నిరంజన్‌, మురళి, కోదండరెడ్డిల నియామకంపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది.


  • విధి విధానాలివీ..

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పునరుత్తేజం, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అవకాశాలు, సాగులో ఎదురయ్యే కీలక సవాళ్ల పరిష్కారం, అన్ని వర్గాల రైతుల సంక్షేమం-అభివృద్ధి.. తెలంగాణ వ్యవసాయ-రైతు సంక్షేమ కమిషన్‌ లక్ష్యం. భవిష్యత్‌ తరాలకు పోషకాహార భద్రత, వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి మెరుగుదల, పర్యావరణ సుస్థిరతకు కమిషన్‌ మార్గదర్శకంగా ఉండనుంది. కమిషన్‌ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గుణాత్మక మార్పులు, రైతు కుటుంబాల ఆదాయం పెంపు మార్గాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. దీని కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు సభ్య కార్యదర్శిని నియమిస్తారు. కాగా, కమిషన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఇది ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి గ్రాంట్లు, విరాళాలను సేకరించవచ్చు.

Updated Date - Sep 07 , 2024 | 03:08 AM