TET EXAM: ఏడాదికి రెండుసార్లు టెట్!
ABN , Publish Date - Jul 07 , 2024 | 04:09 AM
ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
నిబంధ నలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి.. ఏప్రిల్/మే నెలలో మాత్రమే టెట్‌ను నిర్వహించాలనే నిబంధన ఉండగా దాన్ని సవరిస్తూ ఏడాదిలో మొదట జూన్‌లో, రెండోసారి డిసెంబరులో పరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం శనివారం నిబంధనలు సవరిస్తూ జీవో నంబరు 18ను విడుదల చేశారు.
ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా... ఉపాధ్యాయుల పదోన్నతికి అర్హత సాధించాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టెట్‌ను పదేపదే నిర్వహించకపోవడంతో అభ్యర్థులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందనే విజ్ఞప్తితో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.