Share News

Budget 2024-25: రాష్ట్ర బడ్జెట్‌ 25న?

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:19 AM

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ నెల 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Budget 2024-25: రాష్ట్ర బడ్జెట్‌ 25న?

9.jpg

  • 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు

  • 2 వరకు శాసన సభ, మండలి?

  • రైతు భరోసా, బీసీ రిజర్వేషన్లపై చర్చ!

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ నెల 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు ప్రభుత్వం ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాని గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి 31లోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ నెల 23 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు 24 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అనుమతి ఇవ్వడంతో శాసనసభా కార్యదర్శి వి.నర్సింహాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


23న ఉదయం 11 గంటలకు శాసనసభ, 24న ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు 23న సంతాపం తెలపనున్నారు. సమావేశాలను 23న ప్రారంభించి, ఆదివారం మినహాయించి 31 వరకు ఎనిమిది రోజుల పాటు కొనసాగిస్తారా? లేక ఆగస్టు 2 వరకు 10 రోజుల పాటు నిర్వహిస్తారా? అనేది శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో తేల్చనున్నారు. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో 2 వరకు సమావేశాలను కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఈ సమావేశాలు 31 తర్వాత కూడా కొనసాగించదలిస్తే ఆ లోపే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉంటుంది.


రైతుభరోసాపై చర్చ..!

ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. పథకం విధివిధానాల రూపకల్పనకు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై లఘు చర్చ చేపట్టే అవకాశం ఉంది. రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ సొమ్ము అందించాల్సి ఉన్నందున.. విధివిధానాలను త్వరగా రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ఈ సమావేశాల్లోనే సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపైనా చర్చ చేపట్టవచ్చని తెలుస్తోంది.


కొన్ని కీలక బిల్లులనూ ప్రవేశపెడతారని సమాచారం. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాన్ని కూడా చర్చకు పెట్టవచ్చని తెలుస్తోంది. సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందినవారి నుంచి సొమ్మును రికవరీ చేసే అంశంపైనా సభలో చర్చిస్తారని సమాచారం. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసే అంశమూ చర్చకు రావొచ్చు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఇటీవల ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలున్నాయి.

Updated Date - Jul 19 , 2024 | 03:19 AM