High Court: ఐఎంజీకి భూ కేటాయింపు కేసులో.. సీబీఐ దర్యాప్తునకు నో
ABN , Publish Date - Sep 12 , 2024 | 04:15 AM
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
హైకోర్టులో విజయసాయికి చుక్కెదురు!
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. 20 ఏళ్ల కిందట.. 2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ అకాడమీ్‌సకు చేసిన భూకేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ విజయసాయిరెడ్డి తదితరులు దాఖలు చేసిన మూడు ప్రజాహిత వ్యాజ్యాలను కోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే అంశంపై గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి, దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్టేశాయని గుర్తుచేసింది.
ఆ తీర్పులు శిరోధార్యమని స్పష్టం చేసింది. తాజా వ్యాజ్యాల్లోనూ.. పిటిషనర్లు తీవ్ర ఆలస్యం, అలక్ష్యం చేశారని, ఏళ్ల తరబడి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. పాత అంశంపై తాజా వివాదాన్ని కొనసాగించడానికి అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ వ్యాజ్యాలపై ఆర్టికల్ 226 కింద తమకున్న అసాధారణ, విచక్షణాధికారాన్ని వినియోగించాల్సిన అవసరం లేదని వివరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐఎంజీ భారత్ అకాడమీ్‌సకు చేసిన 850 ఎకరాల భూకేటాయింపు, ఎంవోయూపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, న్యాయవాది టి.శ్రీరంగారావు 2012లో వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం తాజాగా తుది విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యాల్లో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది.