TTD: నాణ్యమైన నెయ్యి అందిస్తాం..
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:58 AM
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యితో పాటు, ఇతర పాల ఉత్పత్తులను విజయ డెయిరీ తరఫున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది.
ఇతర పాల ఉత్పత్తులు ఇచ్చేందుకు విజయ డెయిరీ సిద్ధం
టీటీడీ ఈవోకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యితో పాటు, ఇతర పాల ఉత్పత్తులను విజయ డెయిరీ తరఫున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ రాశారు. నెయ్యి సరఫరా కోసం తమకు అవకాశం ఇవ్వాలని, తద్వారా దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ నుంచి శనివారం మీడియా కమిషనర్‌కు లేఖ విడుదలైంది.
దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని లేఖలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలను తీర్చడానికి విజయ డెయిరీ సిద్ధంగా ఉందని తెలిపారు.