Share News

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

ABN , Publish Date - Nov 23 , 2024 | 03:34 AM

సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Mahabubnagar: 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ

  • 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్‌పై వేడుకలు

  • పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

  • ప్రజాపాలన విజయోత్సవాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం

  • ఝార్ఖండ్‌ ఫలితాల పరిశీలకుడిగా భట్టికి బాధ్యతలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డులో వేడుకలను నిర్వహిస్తామన్నారు. విజయోత్సవాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క ఇందులో పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేపట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలపై గడప గడపకూ ప్రచారం చేయాలని చెప్పారు.


ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవాన్ని, డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డులో వేడుకలు, లేజర్‌ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని వివరించారు. ఈ మూడ్రోజుల ఉత్సవాల్లో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకోవాలన్నారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇప్పిస్తున్నామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోన్‌సను అందిస్తున్నామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌లద్వారా ప్రచారం కల్పించాలన్నారు.


  • ఝార్ఖండ్‌ ఫలితాల పరిశీలకుడిగా భట్టి..

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు శనివారం ప్రకటించనున్న నేపథ్యంలో ఝార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల పరిశీలకుడిగా భట్టికి కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్లు తన్వీర్‌ అన్వర్‌, కృష్ణ అల్లవూర్‌లను నియమించింది. ఇటు మహారాష్ట్ర ఫలితాల పరిశీలకులుగా మాజీ సీఎంలు అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ నేత పరమేశ్వరకు బాధ్యతలు అప్పగించారు. కాగా, భట్టి ఝార్ఖండ్‌ ఎన్నికలకు పరిశీలకుడిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 23 , 2024 | 03:34 AM