TG Universities: వర్సిటీల్లో నాసి విద్య..
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:14 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, రీసెర్చ్‌కు సమృద్ధిగా నిధులులేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీల్లో నాణ్యత క్రమంగా తరిగిపోతోంది.
పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ ప్రమాణాలు
విశ్వవిద్యాలయాల్లో నియామకాల్లేవు.. పరిశోధనలు కరువు!
ఏళ్ల తరబడి ఖాళీలు.. సకాలంలో భర్తీ కానీ వీసీ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, రీసెర్చ్‌కు సమృద్ధిగా నిధులులేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీల్లో నాణ్యత క్రమంగా తరిగిపోతోంది. ఫలితంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలతో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు పోటీ పడలేకపోతున్నాయి. తాజాగా కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ) ర్యాంకులు దీనికి అద్దం పడుతున్నాయి. వివిధ కేటగిరీల్లో ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూల స్థానాలు దిగజారాయి. యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లోని నాణ్యతను అంచనా వేసి ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ తాజాగా ర్యాంకులు ప్రకటించింది.
వీటిలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థలకు చెప్పుకోదగ్గ స్థానాలు లభించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, యూనివర్సిటీలకే వివిధ కేటగిరీల్లో మెరుగైన స్థానాలు దక్కాయి. యూనివర్సిటీల్లో పోస్టుల సంఖ్య, ఖాళీలు, రీసెర్చ్, నిధుల కేటాయింపు వంటి పలు అంశాలను ఈ ర్యాంకుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలు పొందిన ర్యాంకుల విషయానికి వస్తే.. ఓవరాల్ ర్యాంకింగ్ కేటగిరీలో 66.69 పాయింట్లతో ఐఐటీ హైదరాబాద్ 12వ స్థానంలో నిలిచింది. 60.55 స్కోర్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానం, 53.74 స్కోర్‌తో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్ 53వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 52.02 స్కోర్‌తో 70వ స్థానంలో నిలిచాయి.
గత ఏడాది ఉస్మానియా వర్సిటీ స్థానం 64గా ఉంది. ఈ ఏడాదిలో ఇది 70కి పడిపోయింది. యూనివర్సిటీల కేటగిరీలో 17వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 43వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ (గతేడాది 36వ స్థానం), 74వ స్థానంలో ఐఐఐటీ హైదరాబాద్ నిలిచాయి. అయితే కాలేజీల కేటగిరీలో వందలోపు తెలంగాణ నుంచి ఒక్కటీ లేదు. అలాగే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కేటగిరీలోనూ అదేపరిస్థితి. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 71.55 స్కోర్‌తో ఐఐటీ హైదరాబాద్ 8వ స్థానం (గతేడాది 8వ స్థానం), ఎన్‌ఐటీ వరంగల్ 21వ స్థానం (గతేడాది 21వ స్థానం), ఐఐఐటీ హైదరాబాద్ 47వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 70వ స్థానంలో ఉన్నాయి. జేఎన్‌టీయూ ఈ ఏడాది 88వ స్థానంలో ఉండగా.. గతేడాది 83వ స్థానంలో నిలిచింది.
మేనేజ్‌మెంట్ కేటగిరీలో 96వ స్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, 97వ స్థానంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, 100వ స్థానంలో ఎన్‌ఐటీ వరంగల్ నిలిచాయి. ఫార్మసీ విభాగంలో 80.29 స్కోర్‌తో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో స్థానంలో ఉన్నాయి. 88వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ (గతేడాది 82వ స్థానం), 95వ స్థానంలో సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, మెడికల్ విభాగంలో 50.99 స్కోర్‌తో ఉస్మానియా మెడికల్ కాలేజీ 48వ స్థానంలో నిలిచాయి. డెంటల్ విభాగంలో 40వ స్థానంలో ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్స్ నిలిచింది. లా విభాగంలో 77.05 స్కోర్‌తో మూడో స్థానంలో నల్సార్ లా యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ విభాగంలో 37వ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిలిచింది.
పైన పేర్కొన్న ర్యాంకుల్లో ఉన్న యూనివర్సిటీలు, ఇతర విద్యా, రీసెర్చ్ సంస్థల్లో ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నవే. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలు, కాలేజీలు చాలా తక్కువున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల పట్ల చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తాజా పరిస్థితి నెలకొందన్న విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, తగిన నిధులను ఇవ్వకపోవడంవంటి కారణాలతో యూనివర్సిటీల్లో నాణ్యత తగ్గిపోతోంది. వైస్ చాన్స్‌లర్ (వీసీ) పోస్టుల నియామకాల విషయంలోనూ ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అవలంబిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ చాలా ఏళ్లు ఇన్‌చార్జీ వీసీలతోనే వర్సిటీల పాలన కొనసాగింది. ప్రస్తుతమూ రెగ్యులర్ వీసీలు లేరు.
అలాగే యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు 5వేలకుపైనే ఉంటాయని అంచనా. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం కామన్ నియామక బోర్డును ఏర్పాటు చేసింది. హెల్త్ యూనివర్సిటీ మినహా మిగిలిన 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల ఖాళీలను ఈ బోర్డు ద్వారా భర్తీ చేసేలా దీన్ని రూపొందించారు. ఈ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం లభించలేదు. రాష్ట్రపతి పరిశీలన కోసం ఈ బిల్లును పంపారు. దాంతో దీనిపై ముందుకు, వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
వర్సిటీల్లో బోధన పోస్టులు,
ఖాళీల వివరాలు..
వర్సిటీ పేరు మొత్తం పోస్టులు ఖాళీలు
ఉస్మానియా 1,268 848
కాకతీయ 403 295
తెలంగాణ 150 75
మహాత్మాగాంధీ 150 115
శాతవాహన 120 100
పాలమూరు 150 130
బీఆర్ అంబేడ్కర్ 84 58
జేఎన్‌ఏ అండ్ ఎఫ్‌ఏ 115 24
జేఎన్‌టీయూ 410 232
పొట్టి శ్రీరాములు 115 97
ఏడేళ్లుగా పూర్తి కానీ భర్తీ ప్రక్రియ
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి రాష్ట్రంలో 2005లో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి రాష్ట్రంలోని ఖాళీలను రెండు దఫాలుగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదికిచ్చింది. అప్పటి నుంచి 2013వరకు కొన్ని నియామకాలను పూర్తి చేశారు. అయితే ఈ నియామకాలన్నీ 2005లో గుర్తించిన ఖాళీ పోస్టులు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో మరో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనలో భాగంగా 2017లో 1,061 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు (జీవో నంబరు 34) జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు.
వర్సిటీ పేరు భర్తీ చేయాల్సిన పోస్టులు
ఉస్మానియా 415
కాకతీయ 136
శాతవాహన 40
తెలంగాణ 59
పొట్టి శ్రీరాములు 07
జేఎన్‌టీయూహెచ్ 186
మహాత్మాగాంధీ 34
బీఆర్ అంబేడ్కర్ 10
పాలమూరు 63
ఆర్‌జీయూకే(బాసర) 96
జేఎన్‌ఏ అండ్ ఎఫ్‌ఏ 15