Share News

Telugu Migrant: 28 ఏళ్లుగా మాతృభూమికి దూరం

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:07 AM

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్లుగా మాతృభూమి ముఖం చూడకుండా ఎడారి దేశంలో మగ్గిపోతున్నాడు ఓ తెలుగు ప్రవాసీ. గత ఏడాది పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Telugu Migrant: 28 ఏళ్లుగా మాతృభూమికి దూరం

  • గల్ఫ్‌లో మగ్గిపోతున్న సిరిసిల్ల వలస కూలీ

  • కంపెనీ నుంచి పారిపోవడంతో బ్లాక్‌లి్‌స్టలోకి

  • ఏడాది క్రితం బహ్రెయిన్‌లో అరెస్టు

  • గుర్తింపు ధ్రువీకరణలో భారత సర్కారు జాప్యం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్లుగా మాతృభూమి ముఖం చూడకుండా ఎడారి దేశంలో మగ్గిపోతున్నాడు ఓ తెలుగు ప్రవాసీ. గత ఏడాది పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన నిరుపేద దళితుడు మానువాడ నర్సయ్య ఉపాధి కోసం 1996లో బహ్రెయిన్‌ వెళ్లాడు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మాతృదేశానికి రాలేదు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే నర్సయ్య అధిక జీతం కోసం కంపెనీ నుంచి పారిపోడంతో అతడి వీసాను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. 21 ఏళ్ల క్రితం వీసా గడువు, 13 ఏళ్ల క్రితం పాస్‌ పోర్టు గడువు ముగిసిపోయాయి.


దీంతో అప్పటి నుంచి అతడు బహ్రెయిన్‌లో అక్రమంగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. గత ఏడాది పోలీసుల తనిఖీలో నర్సయ్య వీసా గడువు ముగిసినట్లు తెలియడంతో బహ్రెయిన్‌ పోలీసులు అతడిని జైలుకు తరలించారు. జైలులో ఉన్న నర్సయ్యను భారతీయుడిగా గుర్తించి స్వీకరించవలసిందిగా బహ్రెయిన్‌ ప్రభుత్వం భారతీయ అధికారులను కోరింది. నర్సయ్య పాస్‌ పోర్టు గడువు ముగియడంతో ఎమర్జెన్సీ పాస్‌ పోర్టు జారీ చేయడం కోసం నర్సయ్య ఫొటో, ఇతర వివరాలను హైదాబాద్‌లోని అధికారులకు నివేదించారు. అయితే, నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు అతడిని అధికారులు చీర్లవంచ వాసిగా గుర్తించలేదు. దీంతో ఎమర్జెన్సీ పాస్‌ పోర్టు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. 34 ఏళ్ల వయస్సులో వచ్చిన నర్సయ్యకు ఇప్పుడు 62 ఏళ్లు.


  • ఊరు లేకపోవడంతో గుర్తింపులో జాప్యం..

నర్సయ్య భార్య లక్ష్మి అనారోగ్యంతో మంచం పట్టింది. కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. కూతురు మతాంతర వివాహం చేసుకుంది. ఆర్థిక, ఇతర సమస్యలతో కుటుంబం చెల్లాచెదురైనట్టు తెలిసింది. చీర్లవంచ మిడ్‌ మానేరులో ముంపునకు గురవడంతో ఆ గ్రామాన్ని మరో చోటుకు తరలించారు. ఈక్రమంలో అధికారులు అతడి గుర్తింపును ధ్రువీకరించడంలో జాప్యం జరుగుతోంది.


నర్సయ్యను స్వదేశానికి పంపించడం కోసం బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి కార్మిక సంక్షేమ విభాగం కన్వీనర్‌ నోముల మురళి ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల నిర్ధారణలో జాప్యం జరుగుతుండటంతో అనేక మంది తెలుగు ప్రవాసీలు స్వదేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ గల్ఫ్‌ విభాగం కన్వీనర్‌ మంద భీంరెడ్డి వెల్లడించారు. గుర్తింపు నిర్ధారణకై ఎదురుచూస్తున్న బహ్రెయిన్‌తో పాటు ఇతర దేశాల్లోని జైళ్లలో ముగ్గుతున్న ప్రవాసీలను స్వదేశానికి రప్పించడానికి వీలుగా గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.


  • జైశంకర్‌కు కేటీఆర్‌ లేఖ..

హైదరాబాద్‌/సిరిసిల్ల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మానువాడ నర్సయ్యనుదేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం లేఖ రాశారు. నర్సయ్యను భారత్‌కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను సమర్పించాలని అక్కడి సర్కారు బహ్రెయిన్‌లోని భారత రాయబారికి లేఖ రాసిందని పేర్కొన్నారు. ఆయనకు తాత్కాలిక పాస్‌పోర్టు ఇప్పించేందుకు విదేశాంగ శాఖ చొరవ చూపాలని కోరారు. నర్సయ్యను రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపాలని సీఎస్‌ కార్యాలయానికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 12 , 2024 | 04:07 AM