అరణ్యంలో హైటెన్షన్..!
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:40 AM
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ నెలకొంది. సోమవారం నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో.. పోలీసులు అప్రమత్తమై.. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్ కోసం జల్లెడపడుతున్నారు.
నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
వరుస ఎన్‌కౌంటర్ల తర్వాత తొలిసారి
పోలీసులు అలర్ట్.. ముమ్మర కూంబింగ్
మావోయిస్టుల వ్యూహం మార్పు
తెలంగాణలో విస్తరణ.. అర్బన్‌పై నజర్?
సమస్యాత్మక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల నిలిపివేత
హిట్‌లిస్టులో ఉన్న వారికి హెచ్చరికలు జారీ
అర్బన్‌పై మావోయిస్టుల నజర్?
తెలంగాణలో విస్తరణపై ఫోకస్
అనుబంధ సంఘాల పునర్నిర్మాణంపై దృష్టి
భూపాలపల్లి, వరంగల్ ప్రతినిధి, చర్ల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ నెలకొంది. సోమవారం నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో.. పోలీసులు అప్రమత్తమై.. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్ కోసం జల్లెడపడుతున్నారు. మండలాల్లో.. సరిహద్దులకు దారి తీసే మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయించి.. హిట్‌లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 261 మంది నక్సల్స్ చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాలను వేదికగా చేసుకుంటుండగా.. ఆ ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు కంకణంకట్టుకున్నారు. దీంతో.. అడవుల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంటోంది.
ఇదీ.. పీఎల్‌జీఏ చరిత్ర..!
పాతికేళ్ల క్రితం(1999 డిసెంబరు 2న) కొయ్యూరులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నక్సల్స్‌కు తీరని నష్టాన్ని కలిగించింది. ఆ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అగ్రనేతల సంస్మరణ సందర్భంగా.. డిసెంబరు 2, 2000 సంవత్సరంలో పీఎల్‌జీఏ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఏటా పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుగుతున్నాయి. 2004లో మావోయిస్టు పార్టీ అవతరించిన తర్వాత.. పీఎల్‌జీఏ అందులో విలీనమైంది. దాడుల్లో.. భద్రతాబలగాలను మట్టుబెట్టడంలో పీఎల్‌జీఏ ముందు వరుసలో ఉంటుంది. తుపాకులతోపాటు.. అవసరాన్ని బట్టి విల్లంబులను, కత్తులను వినియోగించేలా పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణనిస్తారు. పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు మాద్వి హిడ్మా నేతృత్వం వహిస్తుండగా.. మరో 20 బెటాలియన్ల వివరాలు పోలీసులకు కూడా పెద్దగా తెలియదు. 2010 ఏప్రిల్ 6న తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చింది కూడా పీఎల్‌జీఏనే. 2013 సల్వాజుడుం వ్యవస్థాకుడు మహేంద్ర కర్మ, మరో 26 మంది హత్య మొదలు.. 2021 ఏప్రిల్ 4న తెర్రాం ఘటన(హిడ్మా నేతృత్వం) వరకు కూడా పీఎల్‌జీఏ కార్యాచరణే..! కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో భద్రతాబలగాలు నక్సల్స్ కంచుకోటగా పేరున్న అబుజ్‌మఢ్‌కూ చేరడంతో కకావికలం అవుతున్న పీఎల్‌జీఏ.. తిరిగి పూర్వవైభవాన్ని నిలబెట్టుకునేందుకు సోమవారం నుంచి జరగనున్న వారోత్సవాలను వేదికగా చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొవిడ్ కల్లోలం కూడా పీఎల్‌జీఏను కోలుకోలేని దెబ్బకొట్టిందని పోలీసులు భావిస్తుంటారు. గడిచిన ఐదేళ్లలో 467 మందికి పైగా నక్సల్స్ హతమవ్వగా.. వారిలో 95ు మంది ఆదివాసీలే కావడం గమనార్హం..! ఛత్తీ్‌సగఢ్‌లో గడ్డుకాలం ఉండడంతో తెలంగాణ వైపు చూస్తున్న మావోయిస్టులకు ఇక్కడి భూభాగంపై కాలుపెట్టగానే.. కాల్పులు స్వాగతం పలుకుతాయి అన్నట్లుగా నిఘా పెరుగుతోంది. ఈ ఏడాది తెలంగాణలో 4 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 15 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ముగ్గురు మాత్రమే తెలంగాణకు చెందినవారు. మిగతావారంతా ఛత్తీ్‌సగఢ్‌కు చెందినవారే..!
ముమ్మరంగా కూంబింగ్
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నాయి. దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, చర్ల మండలాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నాకాబందీ నిర్వహిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేయాలని పోలీసులు సూచించారు. ఆర్టీసీ బస్సులను కూడా రాత్రిళ్లు నడపకూడదని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో.. భద్రాచలం ఏజెన్సీలోని చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాత్రిళ్లు బస్ సేవలు నిలిచిపోయినున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్ల వద్ద పోలీసులు గస్తీని పెంచారు. కల్వర్టులు, సమస్యాత్మక రహదారుల వద్ద మందుపాతరలు, బాంబులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నాయి. మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నక్సల్స్ మరణాలు ఇలా..
సంవత్సరం మృతుల
సంఖ్య
2019 65
2020 40
2021 51
2022 30
2023 22
2024 261
(డిసెంబరు 1వరకు)
మొత్తం 467
పట్టణ ప్రాంతాలపై గురి
అడవుల్లో నిఘా పెరుగుతుండడం.. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, ఒడిసాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో నక్సల్స్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టిపెడుతున్నారు. దండకారణ్యంపై ఫోకస్ తగ్గించి, అర్బన్ ప్రాంతాలపై దృష్టిసారించాలని మావోయిస్టు అగ్రనేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్బన్‌లో ఉండే నిద్రాణ దళాలను(స్లీపర్‌సెల్స్) యాక్టివేట్ చేసి, పట్టణ ప్రాంతాల్లో పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను ఆసరాగా చేసుకుని, ఇక్కడి యువతను విప్లవం వైపు ఆకర్షితులయ్యేలా చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారని, పీఎల్‌జీఏ వారోత్సవాలను ఇందుకు వేదికగా మలచుకుంటున్నారని భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి. పట్టున్న మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో.. కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణ తమకు సేఫ్‌జోన్‌గా నక్సల్స్ భావిస్తున్నారు. దండకారణ్యం నుంచి నల్లమల వరకు మళ్లీ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే.. తెలంగాణలోకి ప్రవేశ మార్గాలుగా భావించే చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురంతోపాటు.. ములుగు జిల్లాల్లో పోలీసుల నిఘా పెరగడం నక్సల్స్‌కు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.