Hyderabad: విచారణ కమిషన్ల గడువు పెంచండి..
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:07 AM
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు రెండు రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ వ్యవహారాలపై
ఏర్పాటైన కమిషన్ల విషయంలో సర్కారుకు వినతి
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు రెండు రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని లక్ష్యం పెట్టింది. అయితే విచారణ ప్రక్రియ ప్రారంభించి 55 రోజులు మాత్రమే కావడం.. ప్రస్తుతం విచారణ కీలక దశలో ఉండటంతో మరో రెండు నెలల పాటు కమిషన్ గడువు పెంచాలని ప్రభుత్వానికి ఫైలు చేరింది.
దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సంతకం చేశారు. సీఎం రేవంత్ సంతకం చేయగానే గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్ ఒప్పందం, 2000 మెగావాట్ల కారిడార్‌లో బుకింగ్‌తో జరిగిన నష్టం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం, సమీపంలో బొగ్గు లేకున్నా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ గడువునూ నెల పాటు పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి ఫైలు చేరింది. ఈ కమిషన్ విచారణ ప్రక్రియను ఏప్రిల్ 7న ప్రారంభించింది. ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారు. విచారణ ప్రారంభించి 70 రోజులే కావడంతో గడువును నెలపాటు పొడిగించాలనే ఫైలును ప్రభుత్వానికి పంపించారు.