BJP: తీవ్రవాదుల్లా బీజేపీ నేతల వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:55 AM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు.
రాహుల్‌పై బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల ధర్నాలు, ఆందోళనలు
గాంధీభవన్ వద్ద దిష్టిబొమ్మల దహనం
బీజేపీ ఆఫీస్ ముట్టడి యత్నం
ఆందోళనలు ఉధృతం చే స్తాం
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
భోగం వేషం వేసే నటి కూడా దారుణంగా మాట్లాడుతోంది: దానం
హనుమకొండ సిటీ, మహబూబాబాద్, హుజూరాబాద్, హైదరాబాద్, సెప్టెంబరు 18: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. హనుమకొండలోని అంబేడ్కర్ జంక్షన్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా, నిరసన సభకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. రాహుల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు, ఢిల్లీ బీజేపీ నేత తర్విందర్‌సింగ్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సభలో మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రసంగిస్తూ బీజేపీ నేతలు తీవ్రవాదుల్లా మాట్లాడారని, వారి వ్యాఖ్యలు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్‌కుమార్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీపై ఈగ వాలినా సహించబోమన్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాగరాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
మోదీ క్షమాపణలు చెప్పాలి: సీతక్క
తక్షణమే రాహుల్‌కు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనలో సీతక్క పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, గాంధీభవన్ ముందు పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, తర్విందర్‌సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానం నాగేందర్ మాట్లాడుతూ.. భోగం వేషం వేసే ఓ నటి కూడా దారుణంగా మాట్లాడు తోందని బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. మరోవైపు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డగించడంతో అక్కడే కూర్చుని నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నేతలపై బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.