TG : ఆక్రమణలపై హైడ్రా పడగ!
ABN , Publish Date - Aug 07 , 2024 | 05:22 AM
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా రంగంలోకి దిగింది. ఓ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది.
గాజులరామారం చింతల చెరువులో 52 అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ సిటీ/గాజులరామారం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా రంగంలోకి దిగింది. ఓ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. మంగళవారం గాజుల రామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్‌నగర్ చింతల చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎ్‌ఫటీఎల్), బఫర్ జోన్‌లోని సర్వే నంబర్ 329లో ఉన్న 52 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
44.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో అక్రమ నిర్మాణాలున్నట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. సంబంధిత అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా చెరువును పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల వద్ద ఉన్న మ్యాపులు, శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణకొచ్చారు.
200 మంది పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా విభాగం మార్షల్స్, డీఆర్‌ఎఫ్ బృందాలు, ఎక్స్‌కవేటర్లతో కూల్చివేతలు చేపట్టారు. కాగా చింతల చెరువులోని లావునిపట్టా భూమిని మట్టితో చదును చేసి ఓ కబ్జాదారుడు ఆక్రమణలకు తెర తీశాడు. 60, 80, 100 చదరపు గజాల చొప్పున ప్లాట్లు చేసి, విస్తీర్ణాన్ని బట్టి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్లాటు చొప్పున విక్రయించాడు. లావని పట్టా యజమానులకు కబ్జాదారుడు ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
నాలుగైదు నెలలుగా ఈ తంతు జరుగుతోంది. కొనుగోలు చేసిన వ్యక్తులు ప్లాట్లలో చిన్న, చిన్న గదులు నిర్మించారు. కూల్చివేతల సంగతి తెలిసి కొనుగోలుదారులు చెరువు వద్దకొచ్చారు. లక్షలు వెచ్చించి కొన్నామని.. కూల్చివేతలు ఆపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
చెరువుకు కొద్ది దూరంలోనే పోలీసులు వారిని నిలిపివేసి సర్దిచెప్పారు. మూడు గంటల వ్యవధిలో అన్ని నిర్మాణాలను కూల్చివేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ విభాగాలన్ని సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టడంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతోంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలపైనా దశల వారీగా చర్యలుంటాయని రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు, మూసీ పక్కన, ప్రభుత్వ స్థలాల్లో చేసే లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని సూచించారు.