Share News

Osmania Hospital: గోషామహల్‌లో ఉస్మా‘నయా’ ఆస్పత్రి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:04 AM

ఉస్మానియా ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి కోసం కొత్త భవనాన్ని గోషామహల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలంలో, 30 ఎకరాల వైశాల్యంలో నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు.

Osmania Hospital: గోషామహల్‌లో ఉస్మా‘నయా’ ఆస్పత్రి..

  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి కోసం కొత్త భవనాన్ని గోషామహల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలంలో, 30 ఎకరాల వైశాల్యంలో నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం ఆస్పత్రిని వారసత్వ భవనం(హెరిటేజ్‌ బిల్డింగ్‌)గా మార్చుతామన్నారు. సీఎం ప్రకటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా భవన నిర్మాణంపై పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఉస్మానియా కొత్త భవ న నిర్మాణంపై దామోదర కొన్నిరోజులుగా ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.


ప్రస్తు త భవనాన్ని కూల్చివేసి, కొత్తదాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో.. అక్కడ కాకుండా మరోచోట ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఆస్పత్రి కోసం ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని గతంలో నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదు. 2015లో నాటి సీఎం కేసీఆర్‌ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత ఉస్మానియా భవనాన్ని కూల్చి కొత్త ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. అయితే వారసత్వ భవనాల కూల్చివేత ప్రకటనపై కొందరు చరిత్రకారులు కోర్టుకు వెళ్లారు.


దీంతో కోర్టు స్టే ఇచ్చింది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్పత్రిని 1919లో చివరి నిజాం ప్రభువైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నిర్మించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం(టీటీజీడీఏ), తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) హర్షం వ్యక్తం చేశాయి. వీలైనంత త్వరగా ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలని సర్కారును కోరాయి. కాగా, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని గోషామహల్‌లో నిర్మిస్తారని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పడం విశేషం.

Updated Date - Aug 03 , 2024 | 04:04 AM