Food Safety: పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్‌పై నిషేధం
ABN , Publish Date - Oct 31 , 2024 | 03:54 AM
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా, బర్గర్, కేఎ్‌ఫసీ, మోమోస్, షవర్మా తదితర ఆహార పదార్థాలతో కలిపి తినేందుకు దుకాణదారులు ఇచ్చే మయోనైజ్ (ఓ రకమైన సాస్)పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
తయారీ, నిల్వ, వినియోగంపై బ్యాన్
తక్షణ అమలుకు ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఏడాది పాటు కొనసాగనున్న ఆంక్షలు
‘మోమోస్’ ఘటనతో సర్కారు అప్రమత్తత
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా, బర్గర్, కేఎ్‌ఫసీ, మోమోస్, షవర్మా తదితర ఆహార పదార్థాలతో కలిపి తినేందుకు దుకాణదారులు ఇచ్చే మయోనైజ్ (ఓ రకమైన సాస్)పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్ వినియోగం, నిల్వపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం నుంచి ఏడాది పాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది. ఈ మేరకు ఆహార భద్రత కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్, బంజారాహిల్స్‌లో చికెన్ మోమోస్ తిని ఒకరు చనిపోవడమే కాక 50 మంది ఆస్పత్రి పాలైన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, పాశ్చరైజ్డ్ గుడ్లతో తయారు చేసి విక్రయించే బ్రాండెడ్ మయోనైజ్, శాకాహార పదార్థాలతో తయారు చేసే మయోనైజ్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
నిజానికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆహార భద్రత విభాగం అధికారులతో బుధవారం ఓ సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ేసఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. అయితే, పాడైపోయిన, ఉడకబెట్టిన గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ వినియోగం ప్రజారోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అధికారులు మంత్రికి వివరించారు. మోమో్‌సను మయోనైజ్‌తో కలిపి తినడం వల్లే బంజారాహిల్స్ ఘటనలో ప్రజలు అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. మయోనైజ్ నాణ్యత, అది తిన్న తర్వాత జరిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌పై నిషేధం విధించాలని కోరారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు, వైద్యులతో చర్చించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. మయోనైజ్ నిషేధానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఫుడ్ సేఫ్టీ విభాగంలో కొత్త పోస్టుల భర్తీ!
రాష్ట్రంలోని హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌లు, హాస్టళ్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా పెరిగిందని, దానికి అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేయాలని, కొత్త పోస్టులు మంజూరు చెయ్యాలని అధికారులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి.. ఆహార భద్రత, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అంశంలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో పాటిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేస్తామన్నారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని, ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఏడాదికి సుమారు 24వేల శాంపిళ్లను పరీక్షించేలా ల్యాబ్‌లను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆహారం, మందులకు సంబంధించి ప్రజలు ఎవరికి, ఎక్కడ ఫిర్యాదు చేయాలనే అంశాలపై ప్రచారం చేయాలని మంత్రి సూచించారు.