Kodangal Project: 2 ప్యాకేజీలుగా కొడంగల్ ఎత్తిపోతలు
ABN , Publish Date - Aug 06 , 2024 | 04:30 AM
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు.
మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు
ఈనెల 9న టెండర్లు.. బడ్జెట్‌లో రూ.610 కోట్లు
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా రెండు దశల్లో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. తొలుత ఈ పథకం కింద ఉన్న చెరువుల నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలతో ప్రతిపాదించగా తాజాగా 4 టీఎంసీలకు పెంచారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ లిఫ్టు పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజా ప్రతిపాదనల ప్రకారం భూత్పూరు జలాశయం నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చేయాలని, మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటో ప్యాకేజీని తొలి దశలో భూత్పురు జలాశయం నుంచి ఉట్కూరుచెరువు దాకా, రెండో ప్యాకేజీలో జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువు దాకా నీటిని పంపింగ్ చేసే పనులను చేర్చారు. ఈ క్రమంలో ఉట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునికీకరణ, నీటి నిల్వ పెంచడానికి వీలుగా ఈ మొదటి దశ పనులకు రూ.2945 కోట్లు వెచ్చించనున్నారు.
రెండో దశలో ఏడు చెరువులు (జాజాపూర్, దౌలతాబాద్, బొమ్మరాసిపేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్) సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ర్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపడుతారు. దీనికి రూ.1404.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టుకు ఈ పథకం ద్వారా సాగునీటిని అందిస్తారు. అలాగే 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటిని అందించనున్నారు.
అందుకు అవసరమైన అప్రోచ్ చానళ్లు, టన్నెళ్లు, పంప్ హౌజ్, డెలీవరీ మెయిన్స్, సిస్టర్న్స్ నిర్మిస్తారు. దాంతో ఈ పథకం నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి వీలుగా పనుల్లో వేగం పెంచనున్నారు. దీని నిర్మాణ అంచనా రూ.4,350 కోట్లుగా వేశారు. పథకంలో మొత్తం 36 కిలోమీటర్ల మేర ప్రెషర్ మెయిన్‌లు (టన్నెల్‌కు బదులుగాపైపులు) వాడాలని నిర్ణయించారు. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన భూత్పూరు జలాశయం నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి 2024-25 బడ్జెట్‌లో రూ.610 కోట్లను కేటాయించారు.