Budget Concerns: ఆర్నెల్లలో వచ్చింది 39 శాతమే!
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:11 AM
ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కారు అంచనాలకు, వస్తున్న రాబడులకు పొంతన ఉండడం లేదు.
గత ఏడాది కంటే 6ు తగ్గిన రాబడి
ప్రాధమ్యాలు పెరుగుతున్న వేళ రాబడి తగ్గుదలతో సర్కారు ఆందోళన
2652 కోట్ల పన్నేతర రాబడులే ఊరట
ఆర్నెల్లలో 1,01,131 కోట్ల వ్యయం
‘కాగ్’ సెప్టెంబరు నెల నివేదిక
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కారు అంచనాలకు, వస్తున్న రాబడులకు పొంతన ఉండడం లేదు. బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ రాబడి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ప్రభుత్వ ప్రాధమ్యాలు పెరిగిపోతుండగా.. అందుకు తగ్గట్లుగా రాబడులు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మూడో దశ రుణమాఫీ, ఖరీఫ్ సీజన్ రైతు భరోసా, సమగ్ర గురుకుల విద్యాలయాల భవనాల నిర్మాణం వంటివాటికి నిధులు అవసరమైన వేళ.. రాబడి తగ్గుతుండడం ఆందోళనకరమే. ఆదాయం కోసం భూములను విక్రయించడం, తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం, భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరల పెంపు వంటి మార్గాలు తప్ప.. ఇతర దారులేవీ కనిపించడం లేదు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంచనా వేసిన బడ్జెట్ రాబడులు కూడా తగ్గుతుండడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. సెప్టెంబరు నెల రాష్ట్ర ఆదాయ, వ్యయాలకు సంబంధించి ‘కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ బుధవారం నివేదిక విడుదల చేసింది. సెప్టెంబరుతో ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయినా రాబడులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ఆర్నెల్లలో అన్ని రకాల రాబడులు 45.62 శాతం నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో మాత్రం 39.41 శాతమే నమోదవడం గమనార్హం. నిరుటి కంటే 6.21 శాతం మేర ఆదాయం తగ్గింది.
సాధారణంగా ఏ రాబడి మార్గాన్ని చూసినా.. 10-15 శాతం మేర పెరుగుదల ఉంటుంది. కానీ, ఈసారి కొన్ని రాబడుల్లో తగ్గుదల నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, మూలధన రాబడుల కింద మొత్తం రూ.2,74,057.64 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సెప్టెంబరు నాటికి రూ.1,08,011.35 కోట్లు (39.41ు) మాత్రమే సమకూరాయి. ఇందులో అప్పుల రూపంలో తీసుకున్న సొమ్మే 30 శాతం (రూ.32,556.94 కోట్లు) ఉండడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే పన్ను రాబడి కూడా తగ్గింది. పన్నుల కింద మొత్తం రూ.1,64,397.64 కోట్లు వస్తాయని ఆశించగా.. రూ.68,905.80 కోట్లు (41.91ు) సమకూరాయి. గత ఏడాది ఇది 43.73 శాతంగా ఉంది.
కేంద్ర గ్రాంట్లు నయాపైసా రాలే..
కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద సెప్టెంబరులో నయా పైసా విడుదల కాలేదు. ఈ పద్దు కింద ఏడాదిలో రూ.21,636.15 కోట్లను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు నాటికి రూ.2,447.03 కోట్లు సమకూరాయి. సెప్టెంబరులో మాత్రం పైసా కూడా విడుదల చేయలేదు. ఇక రాష్ట్ర పన్నేతర రాబడి కాస్త ఊరటనిచ్చింది. ఒక్క సెప్టెంబరులోనే దీని కింద రూ.2,652 కోట్లు సమకూరాయి. ఏప్రిల్‌లో రూ.354 కోట్లు, మేలో 373 కోట్లు, జూన్‌లో 271 కోట్లు, జూలైలో 256 కోట్లు, ఆగస్టులో 192 కోట్లు సమకూరగా.. సెప్టెంబరులో మాత్రం ఏకంగా రూ.2,652 కోట్లు రావడం విశేషం. ఈ ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యయాల కింద మొత్తం రూ.1,01,131.57 కోట్లను ఖర్చు చేసింది.
తొలి ఆర్నెల్లలో రాబడులు ఇలా..
ఆదాయ మార్గం సెప్టెంబరుకు వచ్చింది మొత్తం గతేడాది వచ్చిన
(రూ.కోట్లలో) అంచనాలో శాతం నిధుల శాతం
పన్నురాబడి 68,905.8 41.91 43.73
జీఎస్టీ 24,732.12 42.21 44.45
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 7,251.21 39.78 37.87
అమ్మకం పన్ను 16,081.63 48.08 37.87
ఎక్సైజ్ సుంకాలు 9,492.98 37.06 61.63
కేంద్ర పన్నుల్లో వాటా 7,533.32 40.98 42
ఇతర పన్నులు, సుంకాలు 3,813.87 37.72 41.31
పన్నేతరాలు 4,101.58 11.65 74.08
గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు 2,447.03 11.31 8.77
అప్పులు 32,536.26 66.06 81.95