36 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం.!
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:30 AM
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగంలో మరో ముందడుగు పడింది. ఈ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్న నేపథ్యంలో శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
14నెలల్లో 4 నివేదికలు.. 22 నెలల్లో నిర్మాణం
డీపీఆర్ కన్సల్టెంట్ కోసం టెండర్లకు ఆహ్వానం
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగంలో మరో ముందడుగు పడింది. ఈ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్న నేపథ్యంలో శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చేలా లక్ష్యం పెట్టుకుంది. మొదటి 14 నెలల్లో వివిధ అంశాలకు సంబంధించి నివేదికలను సమర్పించాలి. ఆ నివేదికలను పరిశీలించి, ఆమోదించిన అనంతరం రహదారి నిర్మాణాన్ని చేపట్టి 22 నెలల్లోనే పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను కార్యరూపంలో పెట్టేందుకు దక్షిణభాగం రహదారికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కోసం ప్రభుత్వం కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం నుంచి డిసెంబర్ 16 మధ్యాహ్నాం 3గంటల వరకు అవకాశం కల్పించింది. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చన్న ప్రభుత్వం.. పలు నియమ, నిబంధనలను పొందుపర్చింది. ఈ టెండర్లను ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. కాగా రహదారి మార్గం(అలైన్ మెంట్) దగ్గరి నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలన్నీ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి.
ముఖ్యంగా రహదారి నిర్మాణం, మార్గమధ్యంలో నిర్మించే వెహి కల్ అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్‌లను ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది తెలియనుంది. రహదారి వెళ్లే మార్గంలో ఏమైనా గ్రామాలు, ఆవాసాలున్నాయా, ఉంటే అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి, సాగు చేసుకుంటున్న భూములున్నాయా, అటవీభూమలు ఎన్ని ఉన్నాయనే వివరాలను సేకరిస్తారు. రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ద్వారా తెలుస్తాయి. అంతే కాకుండా అసలు ఈ రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందన్న వివరాలు కూడా తెలుస్తాయి. కాగా దక్షిణభాగం రహదారి నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థ కోసం ప్రభుత్వం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుందన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ నవంబర్ 14న ‘‘కొంత రుణం..కొంత బాండ్లు’’ శీర్షికన ప్రచురించిన కథనంలోనే చెప్పింది.