Share News

Scheduled Castes: ఉప కులాల వారీగా ఉద్యోగుల లెక్కలు

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:11 AM

రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. దశలవారీగా సమాచార సేకరణకు సిద్ధమైంది.

Scheduled Castes: ఉప కులాల వారీగా ఉద్యోగుల లెక్కలు

  • అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ

  • నేటితో ముగియనున్న కసరత్తు

  • మంత్రివర్గ ఉప సంఘానికి వివరాల అందజేత

  • ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. దశలవారీగా సమాచార సేకరణకు సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎస్సీ ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఎంత మంది ఎస్సీ ఉద్యోగులున్నారు, వారిలో ఉప కులాలవారీగా ఎవరెంత మంది ఉన్నారన్న లెక్కలు తీస్తోంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టవచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.


దామోదర రాజనర్సింహ వైస్‌ చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్నారు. ఈ ఉపసంఘం ఇటీవల సమావేశమై రాష్ట్రంలోని అన్ని శాఖల్లో, కార్పొరేషన్లలో ఉన్న ఎస్సీ ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 1న డేటా సేకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి సంస్థల్లో ఎస్సీ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, వారిలో ఉప కులాలవారీగా ఎంత మంది ఉన్నారన్న వివరాలను పంపాలని ఆదేశించింది. దీని కోసం ఆర్థిక శాఖ ‘ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఐఎ్‌ఫఎంఐఎస్‌)’ పోర్టల్‌లో ప్రత్యేక ప్రొఫార్మా ఉందని, అందులో ఉద్యోగుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. ఈ నెల 5లోపు మొత్తం వివరాలను పొందుపర్చాలని ఆదేశించింది.


ఈ వివరాలనే ప్రభుత్వం వర్గీకరణకు వినియోగించుకోనుంది. ఉద్యోగుల వివరాలు అందితే.. ఏ ఉప కులానికి ఎంత ప్రాతినిధ్యం ఉంది, ఏ ఉప కులానికి లేదు.. అనే వివరాలు తెలుస్తాయని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో కొన్ని ఉప కులాలకు ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా సంచార కులాల వారిలో ఒకరో ఇద్దరు అన్నట్లుగా ఉద్యోగస్తులుంటారని, అలాంటి కులాలకు తగిన న్యాయం జరగాలన్న డిమాండ్లు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఉప కులాల వారీగా ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ఇదే డేటా ఉద్యోగ వాటాలను తేల్చడంలోనూ కీలకం కానుంది. శనివారం నాటికి అన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం ఆర్థిక శాఖకు అందనుంది. దాన్ని ఆర్థిక శాఖ మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పిస్తుంది. సమాచారాన్ని పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - Oct 05 , 2024 | 03:11 AM