Loan Waiver: మూడో విడత రుణ మాఫీకి నిధులు సిద్ధం!
ABN , Publish Date - Aug 11 , 2024 | 03:28 AM
నిర్దేశిత గడువుకల్లా రుణ మాఫీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై దృష్టిసారించింది.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నిర్దేశిత గడువుకల్లా రుణ మాఫీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై దృష్టిసారించింది. ఈమేరకు మూడో విడత రుణ మాఫీ కోసం నిధులను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో లక్షన్నర రూపాయల వరకు అప్పు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేసింది. మూడో విడతలో మరో 6 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.6,000 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
మూడో విడత రుణ మాఫీని 15న అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటోంది. ఈ నెల 6న బహిరంగ మార్కెట్ నుంచి ప్రభుత్వం రూ.3,000 కోట్ల అప్పును సేకరించింది. తాజాగా మరో రూ.3,000 కోట్ల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ పెట్టింది. 11 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్ల ఈ రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 13న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పును తీసుకుంటుంది. దీంతో ఆగస్టు 15నాటికి రూ.6,000 కోట్లు సిద్ధంమవడం ఖాయంగా కనిపిస్తోంది.