Share News

Uttam Kumar Reddy: ఐదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి..

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:33 AM

‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు.

Uttam Kumar Reddy: ఐదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి..

  • బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఎకరాకూ నీరందలేదు

  • పాలమూరు-రంగారెడ్డికి 27 వేల కోట్ల ఖర్చు

  • కాంగ్రెస్‌ ప్రారంభించిన పథకాల్ని పడావు పెట్టారు

  • కృష్ణాలో ‘పాలమూరు’ వాటానూ సాధించలేదు

  • కర్ణాటకతో కలిసి ‘గట్టు’ సామర్థ్యం పెంచుతాం

  • ప్రాజెక్టుల పరిశీలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను వలసలు లేని, సస్యశ్యామల ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఐదేళ్లలోనే పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేస్తాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉదండాపూర్‌, గట్టు, నార్లాపూర్‌, శంకరసముద్రం రిజర్వాయర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి నిర్మాణం కోసం రూ. 27,500కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకూ నీరు అందించలేకపోయిందని విమర్శించారు. పదేళ్లుగా కృష్ణానదిలో నీటి వాటాను కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు- రంగారెడ్డి కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రస్తుత టర్మ్‌లోనే స్థిరీకరిస్తామని స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పనులను దశాబ్దకాలంగా పడావు పెట్టారని, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ప్రకటించారు. లక్ష ఎకరాలకు నీరిచ్చే శంకరసముద్రం రిజర్వాయర్‌ను గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని, ఎన్ని నిధులు ఖర్చు చేస్తే ఎంత అదనపు ఆయకట్టుకు నీరందిచవచ్చో వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌, పునరావాస కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిరు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీలను అరికట్టి, నిల్వ సామర్థ్యం పెంచుతామని తెలిపారు. కర్ణాటక భాగస్వామ్యంతో గట్టు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తామన్నారు.


ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరించడంతోపాటు మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టులను ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటిపారుదల, ఆర్థిక శాఖ సమన్వయంతో ఎక్కడెక్కడ నిధులు వెచ్చించాలో పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తామని, ఆ ప్రకారం పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గద్వాల జిల్లాకు 18 టీఎంసీల కేటాయింపులుంటే 6 టీఎంసీలూ వాడుకోలేని దుస్థితి ఉందని తెలిపారు.


గద్వాల నియోజకవర్గంలో 15-20 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించాలని ఉత్తమ్‌ను కోరారు. అలాగే, శంకరసముద్రం రిజర్వాయర్‌ ద్వారా లక్ష ఎకరాలకు నీరందించవచ్చని, కొన్ని సమస్యల వల్ల కుదరడం లేదన్నారు. ఇన్‌టేక్‌వెల్‌లో బండను తొలగించి వెడల్పు చేస్తే ఎక్కువ నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. కాగా, ఉదండాపూర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద మంగళవారం రాత్రి రూ.45కోట్లు విడుదల కాగా, ఒక్కొక్కరి ఖాతాలో రూ.16.30 లక్షల చొప్పున డిపాజిట్‌ అయ్యాయి. అయితే.. రూ.25లక్షల పరిహారం ఇవ్వాలంటూ బాధితులు మంత్రుల పర్యటనలో నిరసన తెలిపారు.

Updated Date - Sep 26 , 2024 | 03:33 AM