Share News

Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:11 AM

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎ్‌సల తీరునూ తీవ్రంగా పరిగణిస్తోంది.

Police Department: అవినీతి ఐపీఎస్‌లపై  కొరడా!

  • అధికార దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం సీరియస్‌

  • నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్‌ల తీరుపై ఆరా

  • నివేదిక ఆధారంగా అప్రధాన పోస్టింగ్‌లు, ఇతర చర్యలు!

  • పోలీస్‌ శాఖ మొత్తానికీ స్పష్టమైన సంకేతం ఇచ్చే యోచన

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎ్‌సల తీరునూ తీవ్రంగా పరిగణిస్తోంది. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్న కొందరు ఐపీఎ్‌సల వ్యవహారంపై ఆరా తీస్తోంది. నిఘా విభాగం ద్వారా వారి వివరాలు తెప్పించుకొని.. వారిని అప్రధాన పోస్టింగ్‌కు పంపించడంతోపాటు ఇతర చర్యలూ తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీల వరకు వారి పనితీరు, అవినీతి, అక్రమాలపై వచ్చే ఆరోపణలకు సంబంధించి జిల్లా ఎస్పీలు నివేదికలు సిద్ధం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకంగా ఐపీఎ్‌సలపై నిఘా విభాగం నివేదిక సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొంత మంది ఐపీఎ్‌సలు పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.


అలాంటి వారికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా కొంత మంది ఐపీఎస్‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో వారి విషయాన్ని సర్కారు సీరియ్‌సగా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు డబ్బులు తరలించినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ విషయంలో ఓ ఐపీఎస్‌ వ్యవహరించిన తీరు సొంతశాఖలోనే విమర్శలకు దారి తీసింది. ఇదేగాక కొందరు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ దందాలు, సెటిల్మెంట్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో ఘటనలో.. గతంలో ఓ జిల్లా ఎస్పీ పేకాటను కట్టడి చేయాల్సింది పోయి.. తన కుటుంబ సభ్యుల ద్వారా పేకాట నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇందుకు సంబంధించి నిఘా విభాగం నుంచి ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించింది.


  • అధికార దుర్వినియోగంపై ఆరా..

ఓ ఐపీఎస్‌ అధికారి.. గన్‌లైసెన్సు జారీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు పైనా నిఘా విభాగం ఆరా తీస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి కరీంనగర్‌ చిరునామాతో గన్‌లైసెన్సు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో ఐపీఎస్‌ అధికారి చక్రం తిప్పినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వాస్తవానికి కొంతకాలంగా గన్‌ లైసెన్సుల జారీ ప్రక్రియ దాదాపుగా నిలిపివేశారు. అత్యవసరమనుకుంటే అన్ని అంశాలను పరిశీలించి జారీ చేస్తున్నారు. అలాంటిది హైదరాబాద్‌లో ఉండే వ్యక్తికి జిల్లాలో గన్‌లైసెన్సు ఇప్పించడం విస్మయం కలిగిస్తోంది. మరో జిల్లా ఎస్పీ.. పీడీఎస్‌ బియాన్ని అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.


ఇలా.. ఐపీఎస్‌ హోదాను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు చేస్తున్న పనులు పోలీస్‌ శాఖకే కాకుండా ప్రభుత్వానికే మచ్చతెచ్చేవిగా మారాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం సీరియ్‌సగా ఉండటం, నిఘా విభాగం ఆరా తీస్తుందన్న విషయం తెలుసుకున్న ఒకరిద్దరు అధికారులు అప్రమత్తమైనట్లు కూడా తెలిసింది. మొత్తంగా అరడజను మంది ఐపీఎస్‌ల విషయంలో ప్రభుత్వం సీరియ్‌సగా ఉన్నట్లు, వారి మొత్తం రికార్డును తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న వారిని కీలక పోస్టుల నుంచి తప్పించింది. మరీ శ్రుతి మించి వ్యవహరించేవారి విషయంలో అదే స్థాయిలో చర్యలు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.


  • అవినీతిపై జీరో టాలరెన్స్‌ విధానం..

అవినీతి, అలసత్వం, అధికార దుర్వినియోగం.. ఇలా కారణం ఏదైనా హోంగార్డు నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారుల వరకు ఉన్నతాధికారులు జీరో టాలరెన్స్‌ విధానం అనుసరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయడమో, వేకెన్సీ రిజర్వ్‌కు పంపడమో చేస్తున్నారు. అవసరమైతే సస్పెండ్‌ చేస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది శాఖాపరంగా చర్యలు ఎదుర్కొన్న ప్రతిసారీ.. పైస్థాయిలోని అవినీతి, అక్రమాలపై కొందరు వేలెత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ స్థాయి అధికారుల విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మొత్తం పోలీస్‌ సిబ్బందికి ఒక సంకేతం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 08 , 2024 | 04:11 AM