High Court: లగచర్ల కేసు.. కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు
ABN , Publish Date - Nov 22 , 2024 | 02:29 AM
లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.
తమ వెనక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు
హైదరాబాద్ వాసి సురేశ్‌ను కలెక్టర్ హత్యకు నరేందర్‌రెడ్డి పంపారు
చర్చల్లేకుండా దాడి.. హత్యకు కుట్రేతొలిసారి.. కేసీఆర్, కేటీఆర్ పేర్లను
ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్‌డ్రైవ్.. హైకోర్టుకు అందజేత
సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏ-1గా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలను వినిపించారు. ‘‘భూసేకరణకు అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా.. ఏమీ కాదు. మన వెనుక పెద్దలు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు.. అంటూ ఈ కేసులో ఏ-1గా ఉన్న పిటిషనర్ నరేందర్‌రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. విచారణ కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారు. కలెక్టకర్ వచ్చిన వెంటనే.. ఎలాంటి చర్చలు, సంభాషణలు జరగక ముందే.. నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే.. కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఏ-2 సురేశ్ గ్రామంలో స్థానికంగా ఉండడంలేదు. అతడు ఓ యూట్యూబర్. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేశ్ అక్కడికి వెళ్లారు. భూసేకరణలో సురేశ్ భూమి లేదు. హత్య కుట్రలో నరేందర్‌రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు’’ అని కోర్టుకు వివరించారు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది నిందితుల వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా.. తహసీల్దార్ అయినా.. దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ‘‘లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 84 ఫోన్‌కాల్స్ మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలని, ఇంటి భోజనం కావాలని, జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, పలు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని.. ఇలా పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్‌లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్టు చేశారని స్వయంగా అంగీకరించారు’’ అని పీపీ తెలిపారు. ఈ మేరకు నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలను వినిపించారు.
తన క్లైంట్‌ను 15 మంది పోలీసులు కేబీఆర్ పార్కులో కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్‌బెంగాల్’ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని.. ఆ సమాచారం డ్రైవర్‌కు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమిడీస్ ప్రకారమే పిటిషన్లు వేస్తున్నారని.. అది పిటిషనర్ హక్కు అని స్పష్టం చేసింది. పోలీసులు కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమవుతున్నారని.. ఘటన జరిగిన నాటి నుంచి అరెస్టు వరకు పోలీసులు ఏం దర్యాప్తు చేశారు? ఏం ఆధారాలు సేకరించారని నిలదీసింది. డిప్యూటీ కలెక్టర్‌కు తీవ్రమైన గాయాలు అయినట్లు పేర్కొంటున్నా.. డాక్టర్ రిపోర్ట్ అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారంటూ నరేందర్‌రెడ్డి భార్య పట్నం శ్రుతి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.
సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ, వికారాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. భూసేకరణను వ్యతిరేకించినందుకు ఆందోళనకారులపై పోలీసుల వేధింపులు, శారీరక హింస, తప్పుడు కేసుల నమోదుపై.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితారడ్డి, సత్యవతిరాథోడ్, బాధిత రైతుల కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది. తక్షణమే లా అండ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపి, విచారణ జరిపి, వారం రోజుల్లో నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించింది. ‘‘ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని తేలితే.. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవనెత్తుతాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం’’ అని ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఆ నివేదికలో.. ఎఫ్‌ఐఆర్‌ల పరిస్థితి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, అరెస్టుల భయంతో అడవుల్లో దాక్కొంటున్న గ్రామస్థుల వివరాలు ఉండాలని సూచించింది. బాధిత మహిళలకు ఏమైనా వైద్య పరీక్షలు నిర్వహించారా? గాయపడిన గ్రామస్థులకు వైద్యసాయం అందించారా? అనే వివరాలు కూడా ఉండాలని స్పష్టం చేసింది.