Disqualification: విచారణ మొదలే కాలేదు.. అప్పుడే జోక్యమా?
ABN , Publish Date - Nov 06 , 2024 | 02:36 AM
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు.. స్పీకర్ ఎదుట విచారణకు రాకముందే హైకోర్టు సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవడం చెల్లదని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు లిస్ట్ కూడా కాలేదు
హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది?
సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేయండి
హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి తరఫున ఏజీ వాదనలు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు.. స్పీకర్ ఎదుట విచారణకు రాకముందే హైకోర్టు సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవడం చెల్లదని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. అనర్హత పిటిషన్‌లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దురుద్దేశంతో వ్యవహరించారని.. స్పీకర్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో రాజకీయం చేయాలని చూశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇవ్వాలని సెప్టెంబరు 9న హైకోర్టు సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మార్చి 18న పిటిషన్‌లు, మార్చి 30న అదనపు అఫిడవిట్‌లు సమర్పించారు. పది రోజులు గడవకుండానే ఏప్రిల్ 10న హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీనిని బట్టి వారు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. అఫిడవిట్‌లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల అమర్యాదపూర్వకంగా కించపర్చే భాషను ఉపయోగించారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించేలా వ్యవహరించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా వ్యవహరించే స్పీకర్‌కు నిర్దేశిత నిబంధనలు ఉంటాయి. పది రోజుల్లో నిర్ణయం తీసుకోండి లేదా నెలరోజుల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పడానికి స్పీకర్ ప్రభుత్వ అధికారి కాదు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించినందుకు, దురుద్దేశంతో కోర్టుకు వచ్చినందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌లను కొట్టేయాలి’ అని ఏజీ పేర్కొన్నారు.
విస్తృత ధర్మాసనం తీర్పే ప్రామాణికం
హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘కిహోటో హోలోహాన్’ తీర్పును కాకుండా సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన సాధారణ ధర్మాసనం ఇచ్చిన ‘కైశం మేఘాచంద్రసింగ్’ తీర్పుపై సింగిల్ జడ్జి ఆధారపడటం చెల్లదు. ఎక్కువ మంది జడ్జిలున్న ధర్మాసనం ఇచ్చే తీర్పులే దేశంలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ప్రామాణికం. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారడాన్ని సవాల్ చేస్తూ ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి తీర్పు ఇచ్చింది. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఎస్‌ఏ సంపత్‌కుమార్ కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. వీటినీ సింగిల్ జడ్జి పట్టించుకోలేదు. అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకముందే కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అసలు స్పీకర్ ఎదుట కేసులు లిస్ట్ కూడా కాలేదు. విచారణ ప్రారంభం కాలేదు’ అని ఏజీ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంపత్‌కుమార్ కేసుల్లో తానే వాదనలు వినిపించానన్నారు. ఆ తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ సింగిల్ జడ్జి వాటిని పట్టించుకోలేదని.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు స్పీకర్‌ను కించపర్చే విధంగా ఉన్నాయన్నారు. కేసులోవిచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.