Share News

High Court: నివాస ధ్రువీకరణ ఉంటే దరఖాస్తులు స్వీకరించండి

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:09 AM

తెలంగాణలో కాకుండా బయట రాష్ట్రాల్లో ఇండటర్మీడియట్‌ చదివిన స్థానిక విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది.

High Court: నివాస ధ్రువీకరణ ఉంటే దరఖాస్తులు స్వీకరించండి

  • కాళోజీ హెల్త్‌ వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

  • బయట రాష్ట్రాల్లో ఇంటర్‌ చదివిన స్థానికులకు ఊరట

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాకుండా బయట రాష్ట్రాల్లో ఇండటర్మీడియట్‌ చదివిన స్థానిక విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నివాస ధ్రువీకరణ పత్రం ఉన్న పిటిషనర్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రొవిజనల్‌గా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, ఈ ఉత్తర్వుల ఆధారంగా పిటిషనర్‌లకు ఎలాంటి హక్కులు దఖలు పడదని స్పష్టం చేసింది.


దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 15 (గురువారం) కాబట్టి ప్రాథమికంగా ఈ మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటెంట్‌ అథారిటీ జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా స్థానికత నిర్ధారించాలని గతంలో ఇదే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ తీర్పు ఆధారంగా పిటిషనర్‌ల నివాస ధ్రువీకరణ పత్రంతో మెడికల్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మెడికల్‌ కోర్సుల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి ప్రభుత్వం జూలై 19న జారీచేసిన జీవో 33ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి.


యూజీ నీట్‌ రాసిన విద్యార్థులు బసవ శ్రీదత్త శ్రీకాంత్‌, కల్లూరి నాగనర్సింహ అభిరాం సహా 60 మంది తెలంగాణ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజెస్‌ అడ్మిషన్స్‌ రూల్స్‌ - 2017కు జీవో 33 ద్వారా తెచ్చిన సవరణలను సవాల్‌ చేస్తూ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ధర్మాసనం.. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదాపడింది.

Updated Date - Aug 15 , 2024 | 04:09 AM