Share News

High Court: ఎమ్మెల్యేల అనర్హత కేసు.. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:27 AM

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్‌ జారీచేసే విషయంలో.. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

High Court: ఎమ్మెల్యేల అనర్హత కేసు.. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట

  • డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకునే వరకూ కోర్టుధిక్కరణ చర్యల నుంచి రక్షణ

  • సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీలు

  • ఇవ్వలేమన్న ధర్మాసనం.. 24న తుది విచారణ చేపడతామని వెల్లడి

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ మారినవారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్‌ జారీచేసే విషయంలో.. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన నాలుగు వారాల గడువు 9వ తేదీన ముగిసిపోతున్న నేపథ్యంలో.. దానిపై డివిజన్‌ బెంచ్‌ తుది నిర్ణయం తీసుకునే వరకూ ఆయనకు రక్షణ లభించింది. ఆయన కోరిన విధంగా స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించినప్పటికీ.. ఈ విషయం తమ పరిధిలో ఉన్నందున తుదివిచారణ చేపట్టే వరకూ ఏమీకాదని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన మూడు అప్పీళ్లపైనా 24వ తేదీన తుదివిచారణ జరుపుతామని.. ఆలోగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు వేసినా.. సింగిల్‌ జడ్జి ముందస్తు చర్యలు చేపట్టినా, కేసును రీ ఓపెన్‌ చేసినా.. వాటి గురించి తమ వద్ద ప్రస్తావించవచ్చని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన మూడు అప్పీళ్లనూ తుది విచారణ కోసం ఈనెల 24న విచారణ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది.


తమ పార్టీలో గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ ఎంపీగా పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. వేర్వేరుగా హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. సెప్టెంబర్‌ 9న తుది తీర్పు జారీచేశారు. అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ ఎదుట ఉంచాలని.. నాలుగువారాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ల విచారణకు షెడ్యూల్‌ జారీచేయాలని.. ఆ షెడ్యూల్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)కు అందజేయాలని.. లేనిపక్షంలో సూమోటోగా కేసు మళ్లీ రీఓపెన్‌ చేస్తామని తీర్పులో పేర్కొంది.


  • అప్పటిదాకా ఏం కాదు..

సింగిల్‌ జడ్జి తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. ఆ ఆదేశాలు న్యాయ, శాసనవ్యవస్థల మధ్య సంక్షోభానికి దారితీసేవిగా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన గడువు ముగుస్తోందని.. పిటిషనర్లు కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసినా.. లేదా సింగిల్‌ జడ్జి సూమోటోగా కేసును పునర్విచారణకు స్వీకరించినా ఇబ్బందులు వస్తాయని.. ఈ నేపథ్యంలో స్టే కోరడం తప్ప తమకు మరో మార్గం లేదని విన్నవించారు.


స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసే అధికారం.. స్పీకర్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని దశ (ప్రీ డెసిషన్‌ స్టేజ్‌)లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదని వివరించారు. ఆయన వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌.. ‘మేఘాచంద్రసింగ్‌ వర్సెస్‌ మణిపూర్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ స్పీకర్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా సింగిల్‌ జడ్జి నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ‘‘హైకోర్టు తనకు ఉన్న న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించుకుని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చా? నిర్ణీత సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హైకోర్టు కోరవచ్చా? అనేవి ఇక్కడ తలెత్తుతున్న అంశాలు. ఈ అప్పీళ్లపై తుది విచారణ చేపట్టాలని అడ్వకేట్‌ జనరల్‌ కోరుతున్నారు. 24న తుది విచారణ చేపడతాం. దానికి ముందు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టినా అప్పీలుదారు (అసెంబ్లీ కార్యదర్శి) ఈ కోర్టు ఆశ్రయించేందుకు స్వేచ్ఛ ఇస్తున్నాం’’ అని పేర్కొంది.

Updated Date - Oct 04 , 2024 | 04:27 AM