TG : బీరు మరింత ప్రియం!
ABN , Publish Date - Aug 07 , 2024 | 05:30 AM
రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీల) ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న కొనుగోలు ధర పెంపు
వినియోగదారులపై భారం..
సెప్టెంబరు నుంచి అమల్లోకి
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం వినియోగదారులపై పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. 12 బీర్ల కేసుకు బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్ రూ.289 చెల్లిస్తోంది. పన్నులు కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులు కలిపి మద్యం దుకాణాలవారు కేసు రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు.
ఒక్కో బీరును ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తోంది. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో లైట్ బీరు ధరా రూ.150 అవుతోంది. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి. బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి రెండేళ్లకూ బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు 10 మేర పెంచుతూ ఉంటుంది.
చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 మే నెలలో 6 చొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈసారి 20-25 పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈస్థాయిలో పెంచితే వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10-12 వరకూ పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ధరల భారం కేవలం బీర్లకే పరిమితం కానుంది. ఇతర మద్యం తయారీ ఉత్పత్తిదారులతో జరిగిన ఒప్పందం మేరకు.. ప్రస్తుతం వాటికి పాత ధరలే ఉండనున్నాయి.