Bhatti Vikramarka: సభలో అప్పుల గోల..!
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:38 AM
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్‌ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.
ప్రభుత్వ అప్పులపై భట్టి వర్సెస్ హరీశ్
పదేళ్లలో బీఆర్‌ఎస్ తీసుకున్న రుణాలు రూ.7.11లక్షల కోట్లు
అప్పులకు అసలు, వడ్డీలే రూ.63 వేల కోట్లు చెల్లించాం
ఆర్బీఐకి వివరాలిచ్చింది హరీశే
ఎవరికి సభా హక్కుల నోటీసు ఇవ్వాలో చెప్పండి: భట్టి
మేం తీసుకున్నది 4.17 లక్షల కోట్లే
చేయని అప్పులను మా ఖాతాలో వేస్తే నోటీసులు: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్‌ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో రూ.7,11,911 కోట్ల అప్పు చేశారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. పైగా, రిజర్వ్ బ్యాంక్ ‘హ్యాండ్‌బుక్’లో చెప్పినట్లుగా తాము అంత అప్పు చేయలేదంటూ బీఆర్‌ఎస్ బుకాయిస్తోందని ఆరోపించారు. కార్పొరేషన్ల కోసం తెచ్చిన గ్యారెంటీ అప్పులను ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని, అందుకే ఇది కూడా ప్రభుత్వ అప్పుగానే భావించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే హ్యాండ్ బుక్‌లో పేర్కొన్నట్లు ఆర్‌బీఐ చెబుతోందని, అప్పట్లో ఆర్థిక మంత్రిగా వివరాలు ఇచ్చింది హరీశ్‌రావేనని గుర్తుచేశారు. తప్పుడు లెక్కలు చెప్పి, సభను తప్పుదారి పట్టించిన హరీశ్‌పై సభా హక్కుల ఉల్లంఘననోటీసు ఇవ్వాలా? లేక తనపై ఇవ్వాలా? సభనే తేల్చాలని భట్టి అన్నారు. కాగా, తాము చేయని అప్పును తమపై రుద్దుతున్నారని, పదేళ్లలో కేవలం రూ.4.17 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఇలా అప్పుల అంశం మల్లు భట్టి విక్రమార్క, హరీశ్‌మధ్య తీవ్ర దుమారాన్ని రేపింది. గురువారం ఇలా పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కింది.
అప్పట్లో అప్పులే అప్పులు: భట్టి
రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రం, ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్‌లలోని అంశాలను భట్టి కూలంకషంగా వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీ తన హయాంలో మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి బీఆర్‌ఎస్ చేసిన బడ్జెట్ అప్పులు రూ.3,89,673 కోట్లు, వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మేరకు తీసుకున్న ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ అప్పులు రూ.1,27,208 కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీల మేరకు కార్పొరేషన్లు తీసుకున్న, తిరిగి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు రూ.95,462 కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు రూ.59,414 కోట్లు.. మొత్తం రూ.6,71,757 కోట్లు అని వివరించారు. ఇవి కాకుండా బీఆర్‌ఎస్ దిగిపోయేనాటికే ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు, సంస్థలకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రూ.40,154 కోట్లు ఉన్నాయని, వాటినీ కలిపితే. అప్పులు రూ.7,11,911 కోట్లు అని చెప్పారు. ఏడాది కాలంలో ఎఫ్‌ఆర్‌బీఎం కింద తాము రూ.52,118 కోట్లు తెచ్చామన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులపై ఏడాదిలో అసలు, వడ్డీ కింద రూ.63,796 కోట్లు చెల్లించినట్లు వివరించారు. రాష్ట్ర రాబడులపై 80 శాతం అదనంగా గ్యారెంటీ అప్పులను తెచ్చుకోవాల్సి ఉంటే.. బీఆర్‌ఎస్ వాళ్లు దాన్ని 200 శాతానికి పెంచుతూ చట్టాన్ని సవరించారన్నారు. బడ్జెట్ వెలుపల తీసుకుంటున్న గ్యారెంటీ అప్పుల గురించి వివరాలివ్వడం లేదంటూ ‘కాగ్’ కూడా తప్పుపట్టిందన్నారు. అప్పులు చేయడం తప్పుకాదు కానీ, దుర్వినియోగం చేయడానికే అప్పులు చేశారని.. ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టి సొమ్మును దుర్వినియోగం చేశారని భట్టి మండిపడ్డారు.
శుద్ధ తప్పు: హరీశ్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ హయాంలో చేసిన అప్పు రూ.4,17,296 కోట్లు మాత్రమేనని, రూ.7 లక్షల కోట్ల అప్పు చేశామనడం శుద్ధ తప్పు అని అన్నారు. గతేడాది డిసెంబరులో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటివరకు రూ.1,27,708.84 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఏడాదిలోనే ఇంత అప్పు తీసుకుంటే.. ఐదేళ్లలో రూ.6,38,544.22 కోట్ల అప్పు చేయనున్నట్లు కాంగ్రెస్ చెప్పకనే చెప్పిందన్నారు. తమ ప్రభుత్వంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ, విద్యా సంస్థలకు చెల్లింపులను చేయలేదంటున్నారని, వాటిని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే భట్టి గవర్నర్‌కు రాజీనామా ఇస్తారా? అంటూ సవాల్ విసిరారు. తాము చేయని అప్పును బీఆర్‌ఎస్ ఖాతాలో వేస్తే.. ప్రభుత్వానికి లీగల్ నోటీసులు ఇస్తామని, కోర్టుకెళతామని చెప్పారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ప్రభుత్వ భూములను విక్రయిస్తోందని ఆరోపించారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు గజం భూమిని కూడా విక్రయించలేదని, కేవలం పరిశ్రమల ఏర్పాటు కోసం టీజీఐఐసీకి భూములను బదలాయించే ప్రక్రియ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ భరత్ సంస్థకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి, మామిడిపల్లిలో 850ఎకరాలు కేటాయించారని గుర్తుచేశారు. ఎకరం రూ.50కోట్లు ఉంటే రూ.50వేలకే అప్పగించారన్నారు. వాటిని వెనక్కి తీసుకుంటే రూ.42500 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి వస్తాయన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు: ఉత్తమ్
దారిద్య్రరేఖకు దిగవన ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు జారీచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సంక్రాంతి తర్వాత కొత్త కార్డు ఇస్తామన్నారు. రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించే ఆలోచన ఉందని తెలిపారు. మరో రెండు నెలల్లో తెల్లకార్డులందరికీ సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు. కాగా, ప్రభుత్వం సరైన రీతిలో సభను నడపడం లేదని, అజెండా ప్రకారం చర్చలు చేపట్టడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు.
యూజ్‌లెస్ ఫెలో అంటావా!?
క్షమాపణ చెప్పాల్సిందే: రాజగోపాల్
నన్ను దొంగ అన్నారు: హరీశ్
‘నిండు సభలో ఎమ్మెల్యేను యూజ్‌లెస్ ఫెలో అంటావా? ఇది క్షమించరానిది. క్షమాపణ చెప్పాల్సిందే’ అని హరీశ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భట్టి అప్పుల గురించి మాట్లాడుతుండగా.. హరీశ్ ఒక్కసారిగా ‘యూజ్‌లెస్ ఫెలో’ అన్నారు. ఆ మాట మైక్‌లో గట్టిగా వినిపించింది. స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. ఎవరిని ఉద్దేశించి హరీశ్ ఆ మాట అన్నారో చెప్పాలని, ఎమ్మెల్యేను అంత మాట అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ‘దొంగ’ అన్నారని, అందుకే వారిని ఆ మాట అన్నానని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిలబడి హరీశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.