Gold Theft: బస్సులో బంగారం చోరీ..థార్ గ్యాంగ్ పనే
ABN , Publish Date - Aug 10 , 2024 | 04:18 AM
బంగారం వ్యాపారులే వాళ్ల టార్గెట్. బంగారం ఎలా తరలిస్తున్నారు.. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు.. ఏ బ్యాగులో తీసుకువెళ్తున్నారు.. ఇలా మొత్తం సమాచారాన్నంతా ముందే సేకరిస్తారు.
బంగారం వ్యాపారులే ఆ ముఠా టార్గెట్
బస్సుల్లో తరలించేప్పుడు వారి వెనకాలే
ఏదైనా హోటల్ వద్ద టీ కోసం బస్సు ఆగితే.. వెంటనే బస్సులోకి దూరి బంగారంతో పరార్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): బంగారం వ్యాపారులే వాళ్ల టార్గెట్. బంగారం ఎలా తరలిస్తున్నారు.. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు.. ఏ బ్యాగులో తీసుకువెళ్తున్నారు.. ఇలా మొత్తం సమాచారాన్నంతా ముందే సేకరిస్తారు. వ్యాపారులు దూరప్రాంతాలకు బస్సులో వెళ్తే వారి వెనకాలే కారులో ఫాలో అవుతారు. బస్సు ఎక్కడైనా టీ, టిఫిన్ల కోసం ఆగినప్పుడు.. సదరు వ్యాపారి తన బ్యాగును బస్సులో పెట్టి కిందికి దిగాడో.. అంతే. వెంటనే ఆ బస్సులోకి దూరుతారు. బంగారం ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లిపోతారు. మధ్యప్రదేశ్ థార్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర గ్యాంగ్ దొంగతనాల తీరు ఇది. ఇటీవల రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ ట్రావెల్ బస్సులోంచి రూ.కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలను కూడా ఈ ముఠానే దోచుకెళ్లింది.
రాచకొండ పోలీసులు ఈ ‘థార్ గ్యాంగ్’లో ప్రధాన నిందితుణ్ని అరెస్టు చేశారు. రూ.1.26కోట్ల విలువైన 1.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. పశ్చిమ ముంబైకి చెందిన కునాల్ కొటారి.. ముంబైలోని జవేరి బజార్ ఆరామ్ మాల్‌లోని ఏడీ జువెలరీ్‌సలో సేల్స్ మేనేజర్. పుణె, ఏపీలోని ఏడీ జువెలరీస్ బ్రాంచిలకు అభరణాలను డెలివరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలై 26న కునాల్ రూ.కోటిన్నర విలువైన 2.1కేజీల బంగారు అభరణాలను తన వద్ద పనిచేసే భరత్‌కుమార్‌కు ఇచ్చి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో చునాబట్టి బస్టాపు నుంచి ఏపీకి పంపించాడు. భరత్‌కుమార్‌కు అందులో ఉన్న ఆభరణాలేంటి.. వాటి విలువ ఎంతన్నది తెలియదు. 26న రాత్రి ముంబైలో బయల్దేరిన బస్సు 27న ఉదయం హైదరాబాద్ దాటింది.
చౌటుప్పల్‌లో ఎన్‌హెచ్-65 పక్కన ధర్మోజిగూడెం పరిధిలో ఓ దాబా వద్ద టీ, టిఫిన్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. భరత్‌కుమార్ సహా ప్రయాణికులంతా దాబాలోకి వెళ్లారు. అప్పటివరకు బస్సు వెనకాలే కారులో వచ్చిన దొంగల్లో ఇద్దరు అదే అదనుగా బస్సులోకి వెళ్లి బంగారం ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. అదే కారులో పరారయ్యారు. టీ తాగి బస్సులోకి వచ్చిన భరత్‌కుమార్ బ్యాగు పోయిందని గుర్తించి వెంటనే కునాల్‌కు సమాచారం ఇచ్చాడు. కునాల్ ముంబై నుంచి వచ్చి చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డికి బంగారం వివరాలు చెప్పి ఫిర్యాదు చేశారు.
సీపీ ఆదేశాలతో భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలోని పోలీసులు సహా మొత్తం నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలం నుంచి సేకరిచిన సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో.. మధ్యప్రదేశ్‌కు చెందిన థార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి గాలించారు. ఎట్టకేలకు ప్రధాన నిందితున్ని పట్టుకున్నారు. ముఠాలోని మరో ఇద్దరు దొంగల కోసం రాచకొండ పోలీసులు వేట కొనసాగిస్తున్నారని సుధీర్‌బాబు వెల్లడించారు.