Nalgonda : చకచకా ‘యాదాద్రి విద్యుత్కేంద్రం’ పనులు
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:27 AM
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఓవైపు రాజకీయ రగడ..
మరోవైపు వేగంగా నిర్మాణం
విద్యుదుత్పాదన దిశగా వైటీపీఎస్
4 నెలల్లో ప్రారంభోత్సవానికి అవకాశం
నల్లగొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ విద్యుత్కేంద్రంపై రాష్ట్రస్థాయిలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతుండగా.. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను మాత్రంగా చకచకా చేసేస్తున్నారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంటు పనులను బీహెచ్‌ఈఎల్ నిర్వహిస్తోంది.
అక్టోబరు నెలాఖరుకు వాణిజ్య విద్యుదుత్పాదన చేపట్టాలని జెన్‌కో ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు దాదాపు విద్యుదుత్పాదనకు సిద్ధమవడంతో బాయిలర్ల లైటప్ ప్రక్రియ మే 15న విజయవంతంగా నిర్వహించారు. కీలకమైన బాయిలర్లు, చిమ్నీల నిర్మాణాలతో పాటు యాష్ పాండ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
మిగిలిన మూడు యూనిట్ల నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం మేర పనులు జరగ్గా.. వచ్చే మార్చి నెలాఖరుకు ముగుస్తాయని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు యాష్ పాండ్ పనులు, వాటర్ సప్లయి, హైటెన్షన్ పవర్ సప్లయి టవర్లు నిర్మాణ పనులు వేగంగా సాగుతుండడంతో అక్టోబరు నెలాఖరుకు పూర్తవుతాయని జెన్‌కో ఎస్‌ఈ సమ్మయ్య వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా పనులను పూర్తి చేయాలని జెన్‌కో అధికారులు కాంట్రాక్టర్లకు లక్ష్యం విధించడంతో ఆ మేరకు పనుల్లో వేగం కనిపిస్తోంది.