Share News

Hyderabad: అప్పుడు మిలియన్‌ మార్చ్‌.. ఇప్పుడు పదేళ్ల సంబురాలు..

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:37 AM

ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్‌ మార్చ్‌, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ ఆగలేదు.

Hyderabad: అప్పుడు మిలియన్‌ మార్చ్‌.. ఇప్పుడు పదేళ్ల సంబురాలు..

  • కళా ప్రదర్శనలకు వేదికైన ట్యాంక్‌బండ్‌వర్షంలోనే వేడుకల్లో పాల్గొన్న సీఎం, గవర్నర్‌, మంత్రులు

హైదరాబాద్‌ సిటీ, కవాడిగూడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్‌ మార్చ్‌, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ ఆగలేదు. అంతేనా..? గవర్నర్‌ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర ప్రముఖులు వర్షంలో తడిసి ముద్దవుతున్నా.. వేడుకల్లో పాల్గొని, కళాకారుల నృత్యాలు, విన్యాసాలను వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ కళారూపాలతో ట్యాంక్‌బండ్‌పై పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్‌కు కళాకారుల, చేతివృత్తిదారుల స్టాళ్లను చూపించారు. అనంతరం వారిద్దరూ జ్యోతిప్రజ్వలన చేసి, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా కళలను ప్రదర్శించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ రాధాకృష్ణకు ప్రత్యేకంగా పరిచయం చేశారు. యక్షగానం, ఒగ్గు, గుస్సాడి, లంబాడ నృత్యాలతోపాటు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం లౌడ్‌స్పీకర్లలో వినిపిస్తున్నప్పుడు ఐదు వేల మంది ట్రైనీ పోలీసులు జాతీయ జెండాలను చేతబట్టి నిర్వహించిన ఫ్లాగ్‌ మార్చ్‌ ఆహూతులను ఆకట్టుకుంది.


అబ్బురపరిచిన కళారూపాలు

డప్పు వాయిద్యాలు, బోనాలు, పోతరాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాలతో ప్రదర్శన, బతుకమ్మ, గుస్సాడి, గొండుకోయ, ఒగ్గు కథలు, ఆదివాసీ నృత్యాలు, బైండ్ల జమిడకలు, పీర్ల ఉరేగింపు, ధింసా నృత్యాలు, చెంచు, కొమ్ముకోయ, లంబాడి మహిళల నృత్యాలు, జానపద కళాకారుల చిందు యక్షగానం ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు జరుగుతుండగానే అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను వినిపించారు. ఇంద్రధనస్సును తలపించేలా బాణసంచా పేలుళ్లు, లేజర్‌లైటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 10 నిమిషాలపాటు బాణసంచా పేలుళ్లతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు సప్తవర్ణాలతో శోభిల్లాయి. రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ, స్వరపరిచిన ఎంఎం కీరవాణిని సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ఘనంగా సన్మానించారు. వేడుకల్లో డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.


పోలీసులకు పతకాలు

ఉత్తమసేవలు అందించిన పోలీసులకు రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా అవార్డులను అందజేశారు. 2021, 2022 సంవత్సరాలకు గాను.. 22 మంది పోలీసు అధికారులు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌, ఇండియన్‌ పోలీస్‌ మెడల్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. వీరికి సీఎం అవార్డులు ఇచ్చారు. అవార్డులు అందుకున్న వారిలో ఒక అదనపు డీజీపీ, ముగ్గురు ఎస్పీ/కమాండెంట్లు, నలుగురు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. వీరిలో ఆబిడ్స్‌ ఏసీపీ చంద్రశేఖర్‌, సీసీఎస్‌ ఏసీపీ ఎం.కిరణ్‌కుమార్‌, అంబర్‌పేట పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, బేగంపేట ట్రాఫిక్‌ ఎస్సై ఆనంద్‌కుమార్‌, సైబరాబాద్‌ పరిధిలోని ఎస్‌బీ అదనపు డీసీపీ సంక్రాంతి రవికుమార్‌, ఎస్‌వోటీ అదనపు డీసీపీ శోభన్‌కుమార్‌, అల్వాల్‌ ఏఎస్సై ఎం.అనిల్‌గౌడ్‌ ఉన్నారు.అప్పుడు మిలియన్‌ మార్చ్‌..

Updated Date - Jun 03 , 2024 | 03:37 AM