Share News

Hyderabad: నాలా ఎలా?

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:57 AM

అనుమతులు లేని లేఅవుట్లలో గజాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన స్థలాలకు సంబంధించిన నాలా చార్జీలపై పీటముడి వీడడం లేదు. ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారు నాలా చార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Hyderabad: నాలా ఎలా?

  • పదేళ్లుగా నాలా చార్జీలపై పీటముడి!

  • ధరణిలో నమోదై ఉండి ఎకరాలు, గుంటల్లో

  • ఉంటేనే... నాలా చార్జీల చెల్లింపునకు ఆప్షన్‌

  • గజాల చొప్పున రిజిస్ట్రేషనైన స్థలాలకు నో చాన్స్‌

  • సతమతమవుతున్న చిన్న, మధ్య తరహా బిల్డర్లు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా అనుమతివ్వాలని వినతి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేని లేఅవుట్లలో గజాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన స్థలాలకు సంబంధించిన నాలా చార్జీలపై పీటముడి వీడడం లేదు. ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారు నాలా చార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా స్పందించి.. అనుమతులు ఇస్తే రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని బిల్డర్లు, డెవలపర్లు చెబుతున్నారు. 1963లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్స్‌ అసె్‌సమెంట్‌ (నాలా) చార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. ధరణి రాక ముందు ఆర్డీవో స్థాయిలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తూ నాలా చార్జీలు వసూలు చేసే వారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా 5శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలో 9శాతం చొప్పున తీసుకునేవారు.


కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత ధరణిని తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వం.. నాలా చార్జీలు చెల్లించేందుకు తొలుత ఆప్షన్‌ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇచ్చినా.. ధరణిలో నమోదై ఉండి, ఎకరాలు, గుంటల చొప్పున నమోదై ఉన్న భూములకు మాత్రమే అవకాశం కల్పించింది. అనధికార లేఅవుటల్లో గజాల చొప్పున ఓపెన్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి అలాంటి ఆప్షన్‌ లేకుండా పోయింది. ఉదాహరణకు ఒక ఊరి శివారులో వ్యవసాయ భూమి ఉంటే.. ధరణిలో అది ఫలానా సర్వే నంబర్‌లో ఉందని పేర్కొంటూ దాని విస్తీర్ణం ఎకరాలు, గుంటల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి భూమిని మాత్రమే వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్‌ చేసుకునే వీలుంది. గతంలోనే లేఅవుట్‌గా మార్చి, సదరు భూమిని గజాల చొప్పున వేర్వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఉంటే.. ధరణిలో అది హౌసింగ్‌ సైట్‌ అనే పేరుతో చూపిస్తోంది. ఇలాంటి భూమికి నాలా చార్జీలు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. దీంతో దశాబ్దాల క్రితం భూములు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఆప్షన్‌ లేక సతమతం..

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో దశాబ్దాల క్రితమే పెద్దఎత్తున అనధికార లేఅవుట్లు వెలిశాయి. వాటిలో ఓపెన్‌ ప్లాట్లను వేలాది మంది కొనుగోలు చేశారు. ఆయా స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులకు వెళ్లిన సందర్భంలో భూమి విలువలో ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీల కింద 30శాతం, నాలా చార్జీల కింద మరికొంత వసూలు చేసే వారు. దీనికితోడు జీహెచ్‌ఎంసీ పరిధిలోనైతే చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌(సీఎల్‌యూ) పేరిట చార్జీలు తీసుకునేవారు. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత హెచ్‌ఎండీఏలో భవన నిర్మాణ అనుమతుల కోసం వెళ్లినప్పుడు కేవలం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు మాత్రమే తీసుకుంటున్నారు. సదరు స్థలానికి నాలా చార్జీలు చెల్లించకపోతే.. ఆ ఫీజు చెల్లించి పత్రాన్ని తీసుకురావాలని సూచిస్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత గుంటలు, ఎకరాల్లో ఉన్న భూముల కన్వర్షన్‌కు మాత్రమే ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం... గజాల్లో ఉన్న స్థలాలకు సంబంధించిన ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో చిన్న, మధ్య తరహా డెవలపర్లు, బిల్డర్లు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ విషయమై గత ప్రభుత్వాన్ని రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్ల ప్రతినిధులు అనేక మార్లు సంప్రదించినా.. ఫలితం దక్కలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా స్పందించి.. గజాల్లో ఉన్న స్థలాలకూ నాలా చార్జీలు తీసుకొని, భవన నిర్మాణ అనుమతులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. దీన్ని అమలు చేస్తే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు.


సమస్యను పరిష్కరించాలి

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు పదేళ్లుగా పలువురు డెవలపర్లు, బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుమతులు రాకపోవడంతో ఆయా స్థలాలన్నీ నిరుపయోగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చి అదనపు చార్జీలను విధించి ఆదాయాన్ని పొందేందుకు రకరకాల మార్గాలను అప్పటి అధికారులు అన్వేషించారు. కానీ, ఆదాయం వచ్చే మార్గాలను గాలికి వదిలేసి.. ఉన్న చార్జీలను పెంచే ప్రయత్నం చేశారు. కొత్త ప్రభుత్వమైనా స్పందించి రియల్‌ ఏస్టేట్‌ రంగానికి గుదిబండగా మారిన నాలా సమస్యను పరిష్కరించాలి.

- ఎం.ప్రేమ్‌కుమార్‌,

వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌

Updated Date - Jun 17 , 2024 | 04:57 AM