Warangal: సాహితీ వైభవానికి గ్రహణం!
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:45 AM
ఒకరిది తెలంగాణ పురిటి గడ్డ.. మరొకరు తెలంగాణ తొలిపొద్దు! మొదటివారు తియ్యని తేట తెలుగు పద్యాల తెమ్మెర బమ్మెర పోతనైతే, రెండోవారు ‘మన యాసల్నే మన బతుకున్నది’ అని తెలంగాణ యాస గురించి సగర్వంగా చెప్పి తెలంగాణ భాషా దినోత్సవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమగళం కాళోజీ! అయితే.. ఈ మహానుభావులను భావితరాలు స్మరించుకునే గొప్ప లక్ష్యంతో చేపట్టిన నిర్మాణాలకు నిర్లక్ష్యం అనే గ్రహణం పట్టుకుంది.
కాళోజీ కళాక్షేత్రం, పోతన స్మారక చిహ్నంపై నిర్లక్ష్యం.. శంకుస్థాపనలతోనే సరిపెట్టిన బీఆర్‌ఎస్ సర్కారు
ఏళ్లకు ఏళ్లు గడిచినా పూర్తవ్వని పనులు.. అవి కూడా నాసిరకమే
పదేళ్ల ఉత్సవాల సందర్భంగా రేవంత్ సర్కారైనా సంకల్పం తీసుకుంటుందా?
వరంగల్, మే 31 (ఆంధ్రజ్యోతి): ఒకరిది తెలంగాణ పురిటి గడ్డ.. మరొకరు తెలంగాణ తొలిపొద్దు! మొదటివారు తియ్యని తేట తెలుగు పద్యాల తెమ్మెర బమ్మెర పోతనైతే, రెండోవారు ‘మన యాసల్నే మన బతుకున్నది’ అని తెలంగాణ యాస గురించి సగర్వంగా చెప్పి తెలంగాణ భాషా దినోత్సవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమగళం కాళోజీ! అయితే.. ఈ మహానుభావులను భావితరాలు స్మరించుకునే గొప్ప లక్ష్యంతో చేపట్టిన నిర్మాణాలకు నిర్లక్ష్యం అనే గ్రహణం పట్టుకుంది. ఏళ్లు గడిచినా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. 2017లో వరంగల్ జిల్లాలోని పోతన పుట్టిన బమ్మెర గ్రామంలో ఆయన స్మారక చిహ్నం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ పూర్తికాలేదు. అంతకుముందే.. 2014లో హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసినా అదీ పూర్తవలేదు. తెలంగాణ సిద్ధించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించిన తరుణంలో ఈ నిర్మాణాలు నిర్లక్ష్యం అనే చెద పట్టి కొట్టుమిట్టాడుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం!
ఏడాదిలోగా పూర్తిచేస్తానన్న కేసీఆర్
కాళోజీ స్మారకార్థం గత ప్రభుత్వం 2014 సెప్టెంబరు 9న హనుమకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్‌లో కాళోజీ కళాక్షేత్రానికి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా శంకుస్థాపన చేసింది. కుర్చీ వేసుకుని కూర్చుని ఏడాదిలోపు పనులను పూర్తి చేయిస్థానని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌తో కళాక్షేత్రం ప్లాన్ తయారు చేయించారు. తొలుత రూ.50కోట్ల అంచనాతో కాళోజీ కళాక్షేత్రానికి నిధులు మంజూరు చేశారు. నాలుగు అంతస్తులుగా (జీ ప్లస్ 4) భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిని మూడు దశల్లో పూర్తి చేయాలని అప్పటి సర్కారు ఆదేశించింది ప్రభుత్వం. మొదటి అంతస్తులో ఆర్టియం, ఫ్రీ ఫంక్షన్ ఏరియా, ఆఫీసు గదులు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, వాష్ రూమ్స్.. రెండో అంతస్తులో గ్రంథాలయం, ఆఫీసు, స్టోర్స్, లాబీ, వాష్‌రూమ్‌లు.. మూడు, నాలుగో అంతస్తుల్లో ఫ్రీ ఫంక్షన్ లాబీ, బాల్కనీ, టెర్రస్, క్యాట్‌వాక్ లాబీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేశారు.
రెండేళ్లుగా నిధుల జారీ విషయంలో నాటి ప్రభుత్వం నాన్చుడు ధోరణితో కళాక్షేత్రం పనులు నిలిచిపోయాయి. తర్వాత నిర్మాణ వ్యయం రూ.50కోట్ల నుంచి రూ.70కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో కేవలం రూ.30కోట్ల వరకే నిధులు విడుదల చేయటంతో పాటు బిల్లులు సక్రమంగా రాకపోవటంతో నిర్మాణ సంస్థ పనుల నుంచి వైదొలిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం మరొకరికి పనులప్పగించింది. ఈ క్రమంలో పదేళ్లుగా దాదాపు 60శాతం వరకు పనులు పూర్తి చేసినా ఈ పనులన్నీ నాసిరకంగా ఉన్నాయంటూ కొత్త ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కాళోజీ కళాక్షేత్రాన్ని అప్పటి మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ, నిర్మాణం పూర్తి కాకుండానే ఎలా ప్రారంభిస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నలు, వ్యాఖ్యలు వైరల్ కావటంతో చివరి నిమిషంలో కేటీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఏడేళ్లు గడిచినా సగం పనులూ అవ్వలేదు
భాగవత పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన పోతనామాత్యుడు పుట్టింది వరంగల్ జిల్లా బమ్మెరలోనే. అక్కడే పోతన స్మారక చిహ్నం నిర్మాణం కోసం 2017 ఏప్రిల్ 28న అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. పర్యాటక శాఖ నిధుల ద్వారా పోతన స్మారక చిహ్నం నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు నాలుగున్నర ఎకరాల్లో పోతన భారీ విగ్రహంతో పాటు పోతన మ్యూజి యం, యాంఫీ థియేటర్, స్మతివనం, గ్రంథాలయం, కల్యాణమండపం, గార్డెనింగ్, పోతన సమాధి, పోతన పొలం వద్ద బావి సుందరీకరణ, కొత్తగా రోడ్లు తదితరాల కోసం నాటి ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది.
ఏడేళ్లు గడిచినా ఇప్పటిదాకా సగం పనులు కూడా పూర్తి కాలేదు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టిన పోతన సమాధి, పోతన వ్యవసాయం చేసిన బావి ఆధునికీకరణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. నిధులులేమితో పనులు ముందుకు సాగటం లేదు. అలాగే యాంఫీథియేటర్ ఆవరణలో 100టన్నులు గల 18 అడుగుల పోతన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త ప్రభుత్వమైనా కాళోజీ కళాక్షేత్రంతో పాటు పోతన స్మారక చిహ్నం నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.