Suryapet: భర్తకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించి కిరాతకం..
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:05 AM
మళ్లీ ఆడపిల్ల పుడితే భర్తకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించి లింగనిర్ధారణ పరీక్షకు ఒప్పించి, పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని గర్భస్రావం చేయించి గర్భిణి మరణానికి కారకులైన వారిపై పోలీసులు కేసుపెట్టారు.
సూర్యాపేట జిల్లాలో గర్భిణి మృతి ఘటనలో భర్త, ఆడపడుచులు అబార్షన్ చేసిన వారిపై కేసులు
సూర్యాపేటక్రైం, జూన్ 28: మళ్లీ ఆడపిల్ల పుడితే భర్తకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించి లింగనిర్ధారణ పరీక్షకు ఒప్పించి, పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని గర్భస్రావం చేయించి గర్భిణి మరణానికి కారకులైన వారిపై పోలీసులు కేసుపెట్టారు. మహబూబాబాద్ జిల్లా భట్టుతండాకు చెందిన భట్టు క్రిష్ణ కుమార్తె సుహాసిని(26)కి చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌తో 2019లో వివాహమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలుండగా సుహాసిని మరోసారి గర్భం దాల్చింది.మగ సంతానం కోసం భర్త, అతని అక్కలు డోన్‌వాన్ సక్కు, దేవత్ నాగమ్మ, బంధువులు డోన్‌వాన్ మోహన్, రత్నావత్ నాగరాజు, రత్నావ్ బీప్‌సింగ్, రత్నావత్ కమిళి, లక్ష్మి ఆమెను వేధింపులకు గురి చేసేవారు. మగ పిల్లాడు పుట్టకపోతే హరిసింగ్‌కు మరో పెళ్లి చేస్తామని బెదిరించి సుహాసినిని లింగనిర్ధారణ పరీక్షకు తీసుకెళ్లారు.
గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలడంతో గర్భస్రావం చేయించుకోవాలని బలవంతంగా ఒప్పించారు. దీంతో బంధువులతో కలిసి సుహాసినిని భర్త హరిసింగ్ సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 8 నెలల గర్భిణి కావడంతో కుదరదని వారు చెప్పడంతో అక్కడ్నించి హుజూర్‌నగర్‌లోని కమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రి సిబ్బంది నాగేందర్, ఖాసీం, శ్రీనివాసరావు సుహాసినికి అబార్షన్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సుహాసిని ఆరోగ్యం విషమించడంతో ఆమెను కోదాడకు అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తీసుకువెళుతుండగా సుహాసిని ఆరోగ్యం విషమించడంతో తిరిగి సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. హరిసింగ్ ద్వారా మరణవార్త తెలుసుకుని సూర్యాపేట చేరుకున్న సుహాసిని తల్లిదండ్రులు, బంధువులు మృతికి కారణాలను ఆరా తీసి పోలీసులను ఆశ్రయించారు.