Mahesh Kumar Goud: యజ్ఞంలా మూసీ ప్రక్షాళన..
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:39 AM
‘‘హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహా యజ్ఞం లాంటివి. భవిష్యత్ అవసరాల కోసమే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.
హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయి
కేటీఆర్‌వి అవగాహన లేని మాటలు: మహేశ్ కుమార్
నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 5: ‘‘హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహా యజ్ఞం లాంటివి. భవిష్యత్ అవసరాల కోసమే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. వీటిని ప్రజలు స్వాగతించి సహకరించాలి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌ష కుమార్‌గౌడ్ కోరారు. శనివారం నిజామాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడారు. మూసీ ప్రక్షాళనతో ఢిల్లీకి రూ.30వేల కోట్ల ముడుపులు అందుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఇంకా డీపీఆర్‌యే సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ముడుపులు ఎలా ముడుతాయో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
కేటీఆర్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడే తప్ప.. పరిజ్ఞానం, అవగాహన లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో కుండపోత పడితే ఇళ్లలోకి నీరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఎక్కడా పేదలకు ఇబ్బంది పెట్టడంలేదని.. వారికి వేరోచోట ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలోనూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
తన కుటుంబ సభ్యులు కబ్జా చేసినా తొలగించాల్సిందేనని.. అప్పుడే భవిష్యత్తు తరాలు బాగుంటాయని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో హరీశ్ రావు ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని.. అలా కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని.. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.