Share News

Sangareddy: ఏమరుపాటుతో కుటుంబమే ఛిద్రమై..

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:35 AM

బైక్‌తో చిన్నరోడ్డు మీద నుంచి ఆవలివైపు ఉన్న మరో చిన్నరోడ్డులోకి వెళుతూ నడుమ ఉన్న ప్రధాన రోడ్డును దాటాల్సివస్తే? కాస్త అటూ ఇటూ చూసుకోకుండా నేరుగా దూసుకెళితే?

Sangareddy: ఏమరుపాటుతో కుటుంబమే ఛిద్రమై..

  • ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్‌.. నలుగురి దుర్మరణం

  • అనాథలైన ముగ్గురు బాలికలు

  • సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో ఘటన

న్యాల్‌కల్‌, అక్టోబరు 7: బైక్‌తో చిన్నరోడ్డు మీద నుంచి ఆవలివైపు ఉన్న మరో చిన్నరోడ్డులోకి వెళుతూ నడుమ ఉన్న ప్రధాన రోడ్డును దాటాల్సివస్తే? కాస్త అటూ ఇటూ చూసుకోకుండా నేరుగా దూసుకెళితే? ఆ సమయంలో ఏదో ఒక వైపు నుంచి వాహనాలు దూసుకొచ్చి ఢీకొంటే? సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల పరిధిలోని హుసెల్లి చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం వద్ద ఇలానే ఘోర ప్రమాదం సంభవించింది. చౌరస్తాను దాటే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఏమైనా వాహనాలొస్తున్నాయా? అనేది చూసుకోకపోవడం ఓ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. రోడ్డు దాటుతున్న క్రమంలో నలుగురు ప్రయాణిస్తున్న బైక్‌, ప్రధాన రోడ్డు మీద దూసుకెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.


ఈ ఘటనలో బైక్‌ మీద ప్రయాణిస్తున్న నలుగురూ ఎగిరి దూరంగా పడ్డారు. తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. హద్నూర్‌ ఎస్సై రామునాయుడు వెల్లడించిన వివరాల మేరకు.. న్యాల్‌కల్‌ మండల పరిధి గణేశ్‌పూర్‌కు చెందిన బిరాదార్‌ జగన్నాథ్‌(40), ఆయన భార్య రేణుక (30), వీరి కుమారుడు వినయ్‌కుమార్‌(14), జగన్నాథ్‌ మామయ్య గూనెల్లి సిద్ధిరామప్ప (70)సోమవారం ఉద యం సాగు పనులకోసం హుసెళ్లి వైపు ఉన్న తమ పొలానికి వెళ్లారు. సాయంత్రం పనులను ముగించుకుని అక్కడి నుంచి నలుగురూ ఒకే బైక్‌ మీద గణేశ్‌పూర్‌కు బయలుదేరారు.


వీరు ప్రయాణిస్తున్న బైక్‌ హుసెళ్లి చౌరస్తా వద్దకు రాగానే ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డును దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి ఔరాద్‌కు వెళుతున్న కర్ణాటక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న నలుగురు ఎగిరి రోడ్డు మీద పడి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బీదర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జగన్నాథ్‌, రేణుక దంపతులకు నలుగురు సంతానం. బాబు వినయ్‌, ముగ్గురు ఆడపిల్లలున్నారు. తల్లిదండ్రులు జగన్నాథ్‌, రేణుక, సోదరుడు వినయ్‌ మృతితో ముగ్గురు బాలికలు అనాథలయ్యారు. ఒకే కుటుంబానికి నలుగురుమృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Oct 08 , 2024 | 04:35 AM