Share News

Nizamabad: పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:40 AM

ఇంటి బువ్వ తిని ఎన్నాళైందో నాతల్లీ అంటూ.. కూతురికి నోరారా అన్నం తినిపిస్తున్న అమ్మ ఒకరు... ఇంటికి దూరంగా ఉంటూ చదువు సాగిస్తున్న మనుమరాలిని చూసి ఆమె ముచ్చట్లు వింటున్న అమ్మమ్మ మరొకరు..

Nizamabad: పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి

  • రహదారి పక్కన ఉన్నవారిపైకి దూసుకెళ్లిన కారు

  • ఇద్దరు మహిళల మృతి, మరో ముగ్గురికి గాయాలు

  • నిజామాబాద్‌ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం

  • మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 14: ఇంటి బువ్వ తిని ఎన్నాళైందో నాతల్లీ అంటూ.. కూతురికి నోరారా అన్నం తినిపిస్తున్న అమ్మ ఒకరు... ఇంటికి దూరంగా ఉంటూ చదువు సాగిస్తున్న మనుమరాలిని చూసి ఆమె ముచ్చట్లు వింటున్న అమ్మమ్మ మరొకరు.. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న తమ పిల్లలను కళ్లారా చూసుకుని ఆనందంలో ఉన్న ఆ అమ్మలను ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం వారిని పొట్టనబెట్టుకుంది. నిజామాబాద్‌ శివారులోని జ్యోతిభాపూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల వద్ద అదుపు తప్పిన ఓ కారు రహదారి పక్కన ఉన్న వారి మీది నుంచి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కొత్తూరు పోశవ్వ(65), శ్రీరాం పద్మ(40)మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.


దీంతో వసతి గృహంలోని తమ పిల్లలను కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో సందడిగా ఉన్న పాఠశాల వాతావరణం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోయింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన కొత్తూరు హారిక నిజామాబాద్‌ శివారు దాస్‌నగర్‌ వద్ద ఉన్న జ్యోతిభాపూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఇంటర్‌ చదువుతోంది. అలాగే, బోధన్‌ మండలం చిన్నమావందికి చెందిన శ్రీరాం ఈశ్వరి అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు రోజు కావడం తో హారికను కలిసేందుకు ఆమె అమ్మ లీల, అమ్మమ్మ పోశవ్వ పాఠశాలకు వచ్చారు. అదేవిధంగా ఈశ్వరి తల్లి శ్రీరాం పద్మ, అక్క గౌతమి కూడా వచ్చారు. వీరంతా పాఠశాల బయట రహదారి పక్కన మాట్లాడుకుంటున్నారు.


అదే సమయంలో నందిపేట వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు వీళ్ల మీద నుంచి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో పోశవ్వ, శ్రీరాం పద్మ అక్కడికక్కడే మరణించారు. ఈశ్వరి, లీల, హారికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారులో మద్యం సీసాలను గుర్తించిన స్థానికులు కారు నడిపిన సాయి అనే వ్యక్తిని చితకబాదారు. నందిపేటలో జరిగిన ఓ విందులో పాల్గొని వస్తున్న సాయి మద్యం మత్తులో కారు నడిపినట్టు చెబుతున్నారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన సాయిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 15 , 2024 | 04:40 AM