Fire Accident: ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:29 AM
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. మంటల్లో తీవ్రంగా గాయపడిన తండ్రి, పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ చనిపోగా.. భార్య, చిన్న కుమార్తె, మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారు.
తండ్రి, కుమార్తె మృతి.. భార్య, చిన్న కుమార్తె, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గోదాం పైఅంతస్తులో నివాసం ఉంటున్న కార్మికుడి కుటుంబం
అర్ధరాత్రి చెలరేగిన మంటలు
చుట్టూ కమ్మేసిన పొగలు
అఫ్జల్‌గంజ్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. మంటల్లో తీవ్రంగా గాయపడిన తండ్రి, పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ చనిపోగా.. భార్య, చిన్న కుమార్తె, మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కోట్టాల గ్రామానికి చెందిన గోరగంటి శ్రీనివాస్ (40), భార్య నాగమణి దంపతులకు శివప్రియ (10), హరిణి సంతానం. శ్రీనివాస్ 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నాంపల్లికి చెందిన హోల్‌సేల్ ఫర్నిచర్ వ్యాపారి ధనుంజయ బన్సాల్ వద్ద సోఫాల తయారీ పనిచేస్తున్నాడు.
నగరంలో పలుచోట్ల షాపులు నిర్వహిస్తున్న బన్సాల్‌కు జియగూడ వెంకటేశ్వరనగర్‌లో రెండంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫర్నిచర్ విడిభాగాలు తయారు చేయడంతో పాటు గోదాంగా వినియోగిస్తున్నారు. నగరంలో వేరే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబాన్ని ఈ భవనం మొదటి అంతస్తులో ఉండేందుకు బన్సాల్ ఒప్పించి మూడేళ్ల క్రితం తీసుకొచ్చాడు. రోజూలాగే మంగళవారం రాత్రి కూడా గోదాంలో పని పూర్తయ్యాక శ్రీనివాస్ మొదటి అంతస్తులోని ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున సోఫాల ఫోమ్, గడ్డి, ఇతర లెదర్ వస్తువులు ఉండటంతో మంటలు వాటికి వ్యాపించాయి.
ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడం, పొగ కమ్మేయడంతో మొదటి అంతస్తులో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బయటకు రాలేకపోయారు. ఫర్నిచర్ గోదాంలోనే పనిచేస్తూ మొదటి అంతస్తులోనే ఉంటున్న లక్ష్మీబాయి అనే వృద్ధురాలు, మరో మహిళ అమ్ములు ఉజ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన ఆరుగుర్నీ తెల్లవారుజామున ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్, శివప్రియ మృతిచెందారు. నాగమణి, హరిణి, లక్ష్మీబాయి, ఉజ్గరి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా? ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన తెలిసి యజమాని బన్సాల్‌కు గుండెపోటుతో రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.