Share News

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:41 AM

ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.

Patancheru: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తల్లి

  • తాగుడుకు బానిసైన భర్త.. కిడ్నీలు విఫలం

  • కుటుంబ కలహాలతో ఇల్లాలు సతమతం

  • కష్టాలు తాళలేక పిల్లలతో బలవన్మరణం

  • సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దారుణం

పటాన్‌చెరు రూరల్‌, సెప్టెంబరు 1: ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. అసలే పేద కుటుంబం. భర్త అనారోగ్యం బారిన పడటంతో ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆ ఇల్లాలు కుంగిపోయింది. బాధలను భరించలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే, తాను చనిపోతే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారనే బెంగతో.. చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఆదివారం ఈ దారుణం జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు బతుకుదెరువు కోసం 2017 నుంచి రుద్రారం గ్రామంలో ఉంటూ ఇస్నాపూర్‌లో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసైన ఆంజనేయులు ఆరోగ్యం క్షీణించి ఇటీవల కిడ్నీలు పాడయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని ఓ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. భర్త ఆరోగ్యం క్షీణించటం కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు భార్య సువర్ణ(28) తన ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పెద్ద కుమారుడు జశ్వంత్‌(5), కవలలు చిన్మయి(3), చిత్ర(3)లకు విషం ఇచ్చింది. అనంతరం సువర్ణ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.


ఉదయం నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో సమీపంలోనే ఉన్న దూరపు బంధువులు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ముగ్గురు పిల్లలు చనిపోయి ఉండటం గమనించారు. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి.. లోనికి వెళ్లగా సువర్ణ ఉరేసుకుని కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సువర్ణ చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాసిందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆమె చనిపోయిందని ప్రాథమికంగా తేలిందని చెప్పారు.

Updated Date - Sep 02 , 2024 | 04:43 AM