Share News

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:23 AM

పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్‌మెన్‌ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్‌మెన్‌ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది.

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

  • రైలు ఢీకొని ఇద్దరు కూతుళ్లతో సహా

  • రైల్వే ట్రాక్‌మెన్‌ మృతి

  • భర్త, కన్నబిడ్డలను కళ్లెదుటే కోల్పోయిన భార్య

  • మేడ్చల్‌లోని గౌడవెల్లి రైల్వేస్టేషన్‌లో దుర్ఘటన

మేడ్చల్‌ టౌన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్‌మెన్‌ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్‌మెన్‌ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది. ఇది చూసిన ట్రాక్‌మెన్‌ పెద్ద కుమార్తె చెల్లెలను ఆపేందుకు పరుగెడుతూ కేకలు వేసింది. ఆ అరుపులు విన్న ఆ తండ్రి తన బిడ్డలను కాపాడుకునేందుకు యత్నిస్తుండగా రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ ముగ్గురిని కబళించింది.


మేడ్చల్‌ జిల్లా కేంద్రంలోని గౌడవెల్లి రైల్వేస్టేషన్‌లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో కృష్ణ(42) అనే ట్రాక్‌మెన్‌,, అతని కుమార్తెలు వర్షిత(12), వరిణి(7) ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గౌడవెల్లి రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ మెన్‌గా పని చేసే కృష్ణ ఆదివారం విధులు ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బయటికి వెళ్లేందుకు భార్యాబిడ్డలను రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చాడు. భార్యాపిల్లలను ప్లాట్‌ఫామ్‌పై ఉంచిన కృష్ణ పట్టాల వద్ద పని చేసుకుంటున్నాడు.


మరోపక్క ప్లాట్‌ఫామ్‌పై ఆడుకుంటున్న వరిణి తండ్రిని చూసి అతని వద్దకు వెళ్లేందుకు పరుగు తీసింది. ప్లాట్‌ఫామ్‌ చివరికి వెళ్లి పట్టాలు దాటే యత్నం చేసింది. గమనించిన కృష్ణ పెద్ద కుమార్తె వర్షిత చెల్లెలను ఆపేందుకు ఆమె వెంట పరుగెత్తింది. మరోపక్క పిల్లలున్న ట్రాక్‌పై రైలు వస్తుండడాన్ని గమనించిన కృష్ణ వారిని కాపాడేందుకు పరుగుతీశాడు. అయితే, ఆ ట్రాక్‌పై సికింద్రాబాద్‌ వెళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వారిని ఢీకొట్టగా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డ ఆ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కళ్ల ముందే తన ఇద్దరు పిల్లలు, భర్తను కోల్పోయిన కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Aug 12 , 2024 | 03:23 AM