Share News

Tummala: సాగులో తెలంగాణ రోల్‌మోడల్‌ కావాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:47 AM

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

Tummala: సాగులో తెలంగాణ రోల్‌మోడల్‌ కావాలి

  • ఐఏఎస్‌, ఐపీఎస్‌, అధికారుల తరహాలో

  • అన్నదాతలకూ నికర ఆదాయం అందాలి

  • ఆ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది

  • రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం

  • 20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌కు చాన్స్‌

  • రైతు వేదికలన్నింటికీ వీడియో కాన్ఫరెన్సు

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లాగానే రైతులు కూడా పంటల సాగు ద్వారా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా నికర ఆదాయాన్ని పొందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం ఆ దిశగా పనిచేసిందని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్క ఏడాదిలోనే అమలు చేశామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వానికీ చేయని విధంగా తెలంగాణ సర్కారు పనిచేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రిగా తాను చేసిన అబివృద్ధి, సంక్షేమాన్ని; రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్యూలో తుమ్మల వివరించారు.


  • రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి చేపట్టిన చర్యలేంటి?

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ చేశాం. 25.5 లక్షల మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. 41 లక్షల మంది రైతులకు వర్తించే బీమా పథకానికి రూ.1,433 కోట్లు ప్రీమియం చెల్లించాం. గత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రద్దుచేసింది. దాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు చేపట్టాం.

  • రైతు భరోసా ఎప్పటినుంచి అమలు చేస్తారు?

  • వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతుభరోసా పథకం అమలు చేస్తాం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. మా ప్రభుత్వం మాత్రం ప్రీమియం మొత్తం చెల్లించి, వచ్చే ఏడాది నుంచి పంటల బీమా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అకాల వర్షాలకు పంటలు నష్టపోతే ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేశాం.

  • రైతులకు ఇప్పటికి ఎంత బోనస్‌ చెల్లించారు?

  • దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పంట వేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు అందించడంతోనే ఇది సాధ్యమైంది. సన్న బియ్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో రూ.874 కోట్లు జమచేశాం. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సీసీఐ ద్వారా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొంటున్నాం.

  • వ్యవసాయాభివృద్ధికి మీ కార్యాచరణ?

  • దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్నిరకాల పంటలు పండుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తాం. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడం, ఇక్కడ పండించే ప్రతి పంటను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడం, రైతులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, లాభసాటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యవసాయ మంత్రిగా నాకున్న ఆలోచనలతో ఇందుకు ప్రణాళికలు రూపొందించుకుంటా. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్‌మోడల్‌గా ఉంచాలన్నది నా ఆకాంక్ష. అందుకే రాష్ట్రంలో రైతు అభివృద్ధి, సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.52 వేల కోట్లు కేటాయించాం.

  • ఎక్కువ మంది పామాయిల్‌ వేస్తే మార్కెట్‌ ఎలా?

  • రాష్ట్రంలో రూ.350 కోట్లతో ఆయిల్‌పామ్‌ ప్రణాళిక రూపొందించి, ఎకరానికి రూ.51 వేలు సబ్సిడీ ఇచ్చి పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం. గతంలో పామాయిల్‌ టన్ను ధర రూ.13 వేలు కాగా.. ఇప్పుడు రూ.20,411కు చేరింది. రాష్ట్రంలో పంట విస్తీర్ణాన్ని 50 వేల నుంచి 2 లక్షల ఎకరాలకు పెంచాం. ఈ పంట సాగుకు 20 లక్షల ఎకరాలు అనుకూలంగా ఉన్నాయి. పామాయిల్‌ దిగుమతి కారణంగా రూ.లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యం చెల్లిస్తున్నారు. పామాయిల్‌ సాగు ఎంత పెరిగితే రైతుకు అంత మంచిది. అలాగే విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతుంది.

  • రాష్ట్రంలో కొత్తగా సాగు చేసే పంటలకు ప్రోత్సాహం ఎలా?

  • పామాయిల్‌లోనే అంతర పంటలుగా కోకో, వక్క, జాజి, మునగ వంటి పటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూని ట్లు పెద్దఎత్తున నెలకొల్పి, రైతులు పండించే పంటలను పలు ఉత్పత్తులుగా ఎగుమతులు చేసేందుకు ఫుడ్‌పార్కులు ఏర్పాటు చేస్తున్నాం.

  • మార్కెటింగ్‌ వ్యవస్థలో దళారీలను ఎలా అరికడతారు?

  • దేశ, విదేశాల్లో ఏ పంటకు ఎంత రేటుందో క్షణాల్లో తెలుసుకునేలా జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేయబోతోంది. హైదరాబాద్‌ సమీపంలోని కోహెడాలో 300 ఎకరాల్లో అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ దేశీ, విదేశీ స్థాయిలో వ్యవసాయ మార్కెటింగ్‌ ఎగుమతులను ప్రోత్సహించబోతున్నాం. ఈనామ్‌ పద్ధతిలో పంటల కొనుగోలుకు మార్కెట్లను ఆధునికీకరించబోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషితో వ్యవసాయ మార్కెట్లపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తు వ్యాపారం కూడా చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న 2500 రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సు సౌకర్యాలు కలిపించబోతున్నాం.

  • పసుపు బోర్డు, కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు ఎంతదాకా వచ్చింది?

  • నిజామాబాద్‌లో పసపు బోర్డు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేశాం. పసుపు బోర్డుపై ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు అమలు కాలేదు. కొబ్బరి పరిశోధన కేంద్రం, పసుపుబోర్డు ఏర్పడితే రాష్ట్రంలో పసుపు, కొబ్బరి సాగు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

Updated Date - Dec 07 , 2024 | 03:47 AM