Tummala Nageswara Rao: ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ABN , Publish Date - May 18 , 2024 | 04:45 AM
వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రోత్సహించటానికి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకుగాను ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతిపాదనలు తెప్పించుకొని, తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రతిపాదనలు తెప్పించుకోవాలి:తుమ్మల
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రోత్సహించటానికి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకుగాను ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతిపాదనలు తెప్పించుకొని, తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్న ఫుడ్ పార్కుల్లో ఖాళీ స్థలాలు గుర్తించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు పెట్టుబడిదారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని సూచించారు. ఒకవేళ ప్రైవేటు మార్కెట్లు వస్త్రాలు కొనుగోలుచేయాల్సి వస్తే.. టెస్కో నుంచి ‘నాన్ అవైలబులిటీ’ సర్టిఫికేట్ తీసుకోవాలని ట్రెజరీలు, శాఖలు, కార్పొరేషన్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, జౌళి శాఖల్లో ఒకేరకమైన పనితీరు కలిగిన కార్పొరేషన్లను సంఘటితపర్చి ఒకే కార్పొరేషన్ ఏర్పాటుచేసి బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తే.. ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని మంత్రి తెలిపారు.