Share News

Tummala: ఆయిల్‌పామ్‌ సాగులో నంబర్‌వన్‌గా ఉండాలి

ABN , Publish Date - May 27 , 2024 | 03:29 AM

దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏటా లక్ష నుంచి 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

Tummala: ఆయిల్‌పామ్‌ సాగులో నంబర్‌వన్‌గా ఉండాలి

  • రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండ

  • టన్నుకు రూ.15 వేలు వచ్చేలా కృషి చేస్తాం

  • వరి రైతులు పామాయిల్‌పై దృష్టిపెట్టాలి

  • గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రైతులకు నష్టం

  • సబ్సిడీల పునరుద్ధరణకు సీఎం ఆదేశాలు

  • ఈ సీజన్‌లోనే రూ.15 వేల రైతు భరోసా

  • ఆయిల్‌పామ్‌ రైతు సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏటా లక్ష నుంచి 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆయిల్‌పామ్‌ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలప్పేటలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పామ్‌ రైతుల సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పామాయిల్‌ టన్నుకు రూ.15వేలకు పైగా మద్దత ధర లభించేలా కృషి చేస్తామన్నారు. వరి రైతులు కూడా ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ సాగుపై దృష్టిపెట్టాలని కోరారు.


పామాయిల్‌ దిగుమతి కారణంగా లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని దేశం నష్టపోతోందన్నారు. దేశంలో ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంట నూనె ఉత్పత్తుల పంటల దిగుబడులు ప్రతిఏటా తగ్గుతున్నాయని చెప్పారు. నూనెగింజల సాగు రైతులకు భారమై పూర్తిగా తగ్గిస్తున్నారని, ఈ నేపథ్యంలో దేశ అవసరాల కోసం ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా నూనె ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటి వరకు మొదటిస్థానంలో ఉండగా ఆ రాష్ట్రాన్ని అధిగమించి తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. పదెకరాల్లో పామాయిల్‌ సాగు చేసుకున్న రైతు 30 ఏళ్లపాటు ఏటా ఐటీ ఉద్యోగి వలే అన్ని ఖర్చుల పోను రూ.10లక్షలు సులభంగా సంపాదించుకనే అవకాశం ఉందన్నారు.


ఆయిల్‌పామ్‌ సాగుకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యం భయంలేదని, పామాయిల్‌ సాగు రైతుగా తన అనుభవంతో చెబుతున్నానని మంత్రి తుమ్మల వివరించారు. పామాయిల్‌తో పాటు అంతర పంటగా కోకో పంటలు వేసి అదనంగా ఎకరానికి మరో రూ.లక్ష ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పెడ్‌తో పాటు గోద్రేజ్‌ తదితర కంపెనీల తరఫున ఎక్కడ పంట ఉంటే అక్కడే పామాయిల్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వారంలోనే రైతులు అమ్మిన పంటకు వచ్చే సొమ్ముకు బ్యాంకుల్లో జమ చేయిస్తున్నామని ఆయన తెలిపారు.


రైతులపై గత సర్కార్‌ నిర్లక్ష్యం

రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులకు కొన్ని ఇబ్బందులు కలిగాయని మంత్రి తుమ్మల చెప్పారు. రైతుబంధు పేరుతో పంటలు వేయని భూములు, కొండలు, గుట్టలకు, క్వారీలకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సైతం రూ.30వేల కోట్ల మేరకు సాగుసాయం అందించారన్నారు. ఇదే పద్ధతిని కొనసాగించాలా? లేదా? అన్నదానిపై వామపక్షాలు, రైతుసంఘాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కష్టాలు, ఇబ్బందులున్నా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీలను తీసేసిందని, వాటన్నింటిని రైతన్నలకు అందించాలని తాను సీఎం రేవంత్‌ రెడ్డిని కోరానని తెలిపారు. ఈ మేరకు సబ్సిడీలన్నింటిని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేసుకుంటూనే రైతుబంధు కింద రూ.7,600 కోట్లు అందించామని పేరొన్నారు.


ఈ వానాకాలం సీజన్‌ నుంచి ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా కింద అందిస్తామని తెలిపారు. పామాయిల్‌ సాగు రైతులకు రెండు పంటలకు కింద రైతుభరోసా అందే అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసివేసిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఎంత ఖర్చయినా భరించి పంటలకు బీమా చేయిస్తుందని, పంటల నష్టానికి పరిహారం వచ్చేలా చేస్తామని తెలిపారు. వరదలు, తుఫాన్లు, ప్రకృతివైరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు ఇలా రైతులు ఏవిధంగా నష్టపోయినా బీమా డబ్బులు అందేలా చూస్తామన్నారు. రుణమాఫీ ఎలా చేయాలో, ఎవరికి చేయాలో సూచించాలని రైతుసంఘాలు, రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.40వేల కోట్ల వరకు పంట రుణం తీసుకున్నట్టు ప్రాథమిక లెక్కలు ఇచ్చారని తెలిపారు. సీతారామా ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్‌ను భారీగా సాగు చేయాలని తుమ్మల సూచించారు.

Updated Date - May 27 , 2024 | 03:29 AM