Tummala: 3వేల కోట్లతో పంటల బీమా ..
ABN , Publish Date - May 23 , 2024 | 03:41 AM
కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని, తాము రూ.3వేల కోట్లతో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాల సాగును పెంచేందుకే రూ.500 బోనస్ ప్రకటించామని తెలిపారు.
సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే బోనస్
మున్ముందు దొడ్డు రకం వడ్లకూ..హామీలు పూర్తి చేయకుంటే వచ్చే
ఎన్నికల్లో ఓట్లు అడగం: తుమ్మల
రేషన్‌గా సన్న బియ్యం మా లక్ష్యం
భవిష్యత్తులో దొడ్డు రకం వడ్లకూ ఇస్తాం
కేసీఆర్ పాలనలో రైతులను కాల్చుకుతిన్నారు: తుమ్మల
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని, తాము రూ.3వేల కోట్లతో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాల సాగును పెంచేందుకే రూ.500 బోనస్ ప్రకటించామని తెలిపారు. గత ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లకే పాలీష్ వేసి అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించిందని గుర్తు చేశారు. పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో దొడ్డు రకం వడ్లకు కూడా ఈ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు.
ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు. రైతులు కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేసింది? ప్రస్తు ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను కాల్చుకుతిన్నది కేసీఆరేనని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని తుమ్మల పేర్కొన్నారు. 2020లోనే రైతులకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉండీ నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు తాము సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తామంటే... బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హామీలన్నీ పూర్తి చేస్తామని, లేకపోతే ప్రజలను ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్వాకం కారణంగా అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ధాన్యం సేకరణ వెయ్యి పాళ్లు నయమనే అభిప్రాయంతో తెలంగాణ రైతులు ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమించామని, ఈ సారి 4 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేస్తామని తెలిపారు. గతంలో క్వింటాల్‌కు 7-10 కిలోల వరకు తరుగు తీసి మిల్లర్లు దోపిడీ చేసే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. గతంలో ధాన్యం డబ్బు చెల్లించడానికి 45రోజులు పట్టేదని, ఇప్పుడు 5 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
వానాకాలం నుంచే పంటల బీమా
వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తున్న సర్కారు.. ఎన్నికల కోడ్ ముగియగానే సంబంధిత నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడానికి మరో మూడు వారాల నుంచి నెల రోజుల సమయం ఉంది. ఆలోపు పంటల బీమా పథకాన్ని పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి రూ. 3 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రీమియం పోగా, మిగిలిన ప్రీమియం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ మేరకు బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదైతే చాలు... ఆ పంటలకు బీమా వర్తిస్తుంది. సుమారు 1.35-1.45 కోట్ల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పంటల బీమా పథకాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈవోలు, ఏవోలు, ఏడీఏలు, డీఏవోలు, సీపీవోలు ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు కొనసాగుతున్నాయి. పంటల నమోదు ఎలా చేయాలి? గ్రామాల వారీగా వివరాల సేకరణ, క్రోడీకరణ, పంటల విస్తీర్ణం లెక్కలు ఎలా తీయాలి? తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు. పంటలను ధ్రువీకరించుకోవడానికి... రైతుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలనే అంశంపైనా చర్చ జరుగుతోంది.