Share News

Tummla Nageshwar Rao: అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:18 AM

బ్యాంకుల నుంచి వచ్చే సమాచారానికి అనుగుణంగా ప్రతి ఖాతాదారుని అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Tummla Nageshwar Rao: అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ

  • ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్షాల దుష్ప్రచారం

  • ఇప్పటిదాకా 22,37,848 మంది రైతులకు రూ.17,933.19 కోట్లు మాఫీ : తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల నుంచి వచ్చే సమాచారానికి అనుగుణంగా ప్రతి ఖాతాదారుని అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా కుటుంబ నిర్ధారణ జరిగిన రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రూ.2 లక్షల లోపు మిగిలి ఉన్న రైతులకు కుటుంబ నిర్ధారణ చేసి వారికీ రుణమాఫీ చేస్తామని తెలిపారు.


రూ.2 లక్షలకు మించి అప్పు ఉన్న రైతులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అదనంగా ఉన్న మొత్తాన్ని చెల్లించిన తర్వాత అర్హతను బట్టి వారికి రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 22,37,848 మంది రైతులకు రూ.17,933.19 కోట్లు మాఫీ చేసినట్లు తుమ్మల వెల్లడించారు. 22 వేల ఖాతాలకు సంబంధించిన నిధులు రిటర్న్‌ వచ్చాయని, ఇందులో 8 వేల ఖాతాలు క్లియర్‌ చేసి రూ.44 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.


పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు వివరించారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా తప్పుగా ఉంటే.. రైతుల నుంచి సరైన వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించామని చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేయటం విడ్డూరంగా ఉందన్నారు.


రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కేటాయించి పంద్రాగస్టు నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్న తుమ్మల.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో లక్ష రూపాయలు మాఫీ చేసేందుకు ఆపసోపాలు పడ్డారని, బీజేపీ తాము అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇంతవరకు రుణమాఫీ చేయలేదని చెప్పారు.


ఇలాంటి పార్టీలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తమ రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:18 AM