Share News

MBBS Seats: 320 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసరు!

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:21 AM

వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై.. అఖిల భారత కోటా రెండు విడతల కౌన్సెలింగ్‌ సైతం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్‌, డెంటల్‌ కాలేజీలకు డీమ్డ్‌ (స్వతంత్ర) యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ).

MBBS Seats: 320 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసరు!

  • ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేజారిన వైనం

  • కౌన్సెలింగ్‌ మొదలయ్యాక మల్లారెడ్డి

  • కాలేజీలకు డీమ్డ్‌ హోదా రావడంతో..

  • ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటూ యూజీసీపై సర్కారు ఫైర్‌

  • కేంద్రానికి ఫిర్యాదుచేసే యోచన.. అవసరమైతే కోర్టుకు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై.. అఖిల భారత కోటా రెండు విడతల కౌన్సెలింగ్‌ సైతం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్‌, డెంటల్‌ కాలేజీలకు డీమ్డ్‌ (స్వతంత్ర) యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ). దీంతో వీటిలో ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్‌ సీట్లు (200 కన్వీనర్‌, 120 బీ కేటగిరీ) కోల్పోవాల్సి వస్తోంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే డీమ్డ్‌ హోదా ఇస్తే అభ్యంతరం ఉండకపోయేది. కానీ, ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూజీసీ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. కోర్టును ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డికి చెందిన రెండు మెడికల్‌ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్‌, రెండు డెంటల్‌ కాలేజీల్లో 200 బీడీఎస్‌ సీట్లున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీ కింద వీటికి డీమ్డ్‌ హోదా ఇస్తూ ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులిచ్చింది. తద్వారా ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటివన్నీ సొంతగానే చేసుకోవచ్చు. తెలంగాణ స్థానిక కోటా వర్తింపజేయాల్సిన పనిలేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో 600 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలోకి వెళ్లిపోయాయి. నిరుటి వరకు ఇందులో సగం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసేవారు.


నీట్‌లో మంచి ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు ఏటా రూ.60 వేలతో మెడిసిన్‌ చదివే అవకాశం దక్కేది. మేనేజ్‌మెంట్‌లోనూ 85 శాతం తెలంగాణవారికే కేటాయించేవారు. ఇప్పుడు డీమ్డ్‌ కావడంతో ఆ నిబంధనలేవీ వర్తించవు. ఒక్క సీటు కూడా రాష్ట్ర విద్యార్థులకు దక్కదు. కౌన్సెలింగ్‌ను కూడా మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) నిర్వహిస్తుంది. అంటే, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సీట్లు ఓపెన్‌ అన్నమాట. కాగా, మల్లారెడ్డి కాలేజీల బాటలో అపోలో, సీఎంఆర్‌ కళాశాలలూ డీమ్డ్‌ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది కొనసాగితే రాష్ట్రంలో కన్వీనర్‌, రిజర్వేషన్‌ కోటా సీట్లు తగ్గి మెరిట్‌, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, డీమ్డ్‌ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, ఎంబీబీఎస్‌ సీట్ల అంశంమై కాళోజీ వర్సిటీ అధికారులతోనూ మంత్రి సమీక్షించారు.


ఒక్కో బ్యాచ్‌కు రూ.175 కోట్లు డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా దక్కే వైద్య కళాశాలలకు రూ.వందల కోట్ల లబ్ధి చేకూరనుంది. ప్రైవేటులో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీటు ఫీజు రూ.60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజు రూ.11.25 లక్షల నుంచి రూ.15 లక్షల దాక ఉంది. కళాశాలల్లో ఉన్న వసతులను బట్టి ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయిస్తుంది. డీమ్డ్‌ వర్సిటీలకు ఈ కమిటీతో సంబంధం లేకుండా, సొంతగానే ఫీజులను నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. మల్లారెడ్డి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ఫీజు రూ.17 లక్షలుగా వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కన్వీనర్‌ కోటా ఫీజు 200 సీట్లకు ఏడాదికి రూ.1.20 కోట్లు వస్తే, ఇప్పుడు అది రూ.35 కోట్లు కానుంది. ఒక్క బ్యాచ్‌ విద్యార్ధులతో ఏకంగా రూ.175 కోట్ల ఆదాయం వస్తుంది. డీమ్డ్‌ యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండదు. సొంతంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనంతో.. ఇక్కడ చదివే విద్యార్థులు సులభంగా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. సంపన్నుల పిల్లలు ఎంత డబ్బయినా వెచ్చించి డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చేరేందుకు సిద్ధమవుతారు.

Updated Date - Sep 15 , 2024 | 03:21 AM